పుష్పకదేశాన్నేలే మాల్యవంత మహారాజుకి ఉన్నట్లుండి వైరాగ్యభావం కలిగింది. ఆయన మంత్రులను పిలిచి, ‘‘ఈ తనువు శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో జీవం నింపుకున్న ఏ ప్రాణీ శాశ్వతం కాదు. ఈరోజునుంచీ నేను అశాశ్వతమైన ఈ ప్రపంచంలోంచి, శాశ్వతమైనదేదో తెలుసుకునేందుకు అన్వేషిస్తాను’’ అని చెప్పాడు. ఇది విని మంత్రులందరూ కలవరపడ్డారు. మాల్యవంతుడు సమర్థుడైన ప్రభువు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలు సుఖంగా ఉంటున్నారు. దేశానికి శత్రుభయం లేకుండా పోయింది.

‘‘ప్రభూ! తనువు శాశ్వతం కాకపోవచ్చు. అసలీ ప్రపంచమే శాశ్వతం కాకపోవచ్చు. కానీ బ్రతికినంతకాలం సుఖంగా రోజులు గడవాలి గదా! మీరు పాలనాభారం వదులుకుంటే దేశంలో ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది. తమరు మనసును చిక్కబట్టుకుని నిర్ణయం మార్చుకోండి’’ అని మంత్రులు మాల్యవంతుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మాల్యవంతుడు ఎవరిమాటా వినలేదు. అంతఃపురోద్యానవనంలో ఓ చిన్న కుటీరం నిర్మింపజేసి, అందులోకి మకాం మార్చేశాడు మాల్యవంతుడు.మంత్రులందరూ మహారాణి పద్మావతి వద్దకువెళ్లి, ‘‘అమ్మా! ఉన్నట్లుండి మహారాజుకు వైరాగ్యమెందుకు కలిగిందో తెలియడంలేదు.

ఈ విపత్కర పరిస్థితిలో ఏం చేయాలో మాకు తోచడంలేదు. తమరే ఏదైనా పరిష్కార మార్గం సూచించాలి’’ అన్నారు.మహారాణి పద్మావతి వారితో, ‘‘ఈ విషయమై నేనూ తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని అందరికీ తెలుసు. ఐనా ఏదో భ్రమ, మాయ మనసుని లోబరుచుకుని సుఖజీవితానికి పురిగొల్పుతుంది. కొందరు ఆ భ్రమ, మాయలనుండి బయటపడతారు. విరాగులవుతారు. ఐతే మనిషిని విరాగిగా బ్రతకమని భగవంతుడు ఆదేశించలేదు. ప్రతి మనిషీ మాయకు లోబడాలన్నదే భగవన్నిర్ణయం.

ఉన్నట్లుండి ఒకమనిషి విరాగిగా మారిపోయాడంటే అందుకు కారణం అతడు జ్ఞాని అయినా కావచ్చు. లేదా మానసిక అనారోగ్యానికి గురై ఉండొచ్చు. ఐతే ప్రభువులు జ్ఞానిగా మారిపోయారని నేను అనుకోవడంలేదు. ఎల్లకాలం రాచకార్యాలలో మునిగి ఉండడంవల్ల, సకల వినోదాలకూ దూరమై క్రమంగా ఆయన మానసిక అనారోగ్యానికి గురయ్యారని నా అనుమానం’’ అన్నది.