ఒకానొక గ్రామంలో విశాలుడనే పేదరైతు ఉండేవాడు. అతడికి భార్య, నలుగురు పిల్లలు. తలిదండ్రులు అతడితోనే ఉండేవారు. అతడికి బంధుప్రీతి ఎక్కువ. దాంతో తరచుగా చుట్టాలు వస్తూపోతూ ఉండేవారు. అందువల్ల విశాలుడికి డబ్బు బాగా ఖర్చయ్యేది. తనకువచ్చే ఆదాయం చాలకకపోతే తెలిసినవారివద్ద అప్పు చేసేవాడు. ఆ అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో అప్పులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం విశాలుడికి ఊరునిండా అప్పులే! అయినా ఎప్పుడూ దిగులుపడేవాడు కాదు. చెరగని చిరునవ్వుతో ఉండేవాడు. ఊరివారు అతణ్ణి నిత్యసంతోషి అనేవారు.

ఆ ఊళ్లో భాగ్యవంతుడు చంద్రనాథుడికి విశాలుడి సంతోషం ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఆయన విశాలుణ్ణి పిలిచి, ‘‘నాకు రెండుభవంతులున్నాయి, రెండువందల ఎకరాలపొలం ఉంది. ఇంటినిండా రత్నాలరాసులున్నాయి. కానీ నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. నీకున్నది రెండెకరాల పొలం. నీకు ఆదాయంకంటే ఖర్చు ఎక్కువ. అయినా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఇదెలా సాధ్యం?’’ అని అడిగాడు.‘‘అయ్యా! దిగులు మన అవసరాలు తీర్చదు. కష్టాలు తొలగించదు. ఈనాడున్న మనిషి రేపు ఉంటాడో ఉండడో తెలియని అశాశ్వతమైన జీవితం మనది.

అలాంటి జీవితాన్ని దిగులుపడుతూ, దుఃఖిస్తూ గడపడం తెలివితక్కువ. సమస్యవస్తే తాత్కాలికంగా చెయ్యగలిగింది చేస్తాను. ముందు ముందు ఏమవుతుందోనని బెంగపడకుండా వర్తమానంలో సంతోషంగా జీవించడమే నాపద్ధతి’’ అన్నాడు విశాలుడు తడుముకోకుండా.ఈ మాటలకు చంద్రనాథుడికి కోపం వచ్చింది. ఎందుకంటే అప్పటికే విశాలుడు ఆయనకు మూడువందల వరహాలు బాకీ ఉన్నాడు. ‘‘నీ సంతోషం సంగతి సరే! మరి నాబాకీ తీర్చే ఆలోచనుందా లేదా నీకు?’’ అని అడిగాడాయన.