ఆ రైతు భార్య అందాలరాశి. భార్య అంటే అతడికి చెప్పనలవికాని ప్రేమ. కానీ ఆమెకు పెద్ద జబ్బు చేసింది. గడవులోపు స్వర్ణభస్మ ఔషధమిచ్చి ఆమె ప్రాణాలు కాపాడాలి. వైద్యుడిసలహాతో చంపకవనానికి బయలుదేరాడు రైతు. కొంతదూరం మాయావృక్షం ఎక్కి ప్రయాణించాడు. ఆ తర్వాత మాత్రికుణ్ణి కలిశాడు. అతడి సలహాతో చంపకవనంలో ప్రవేశించాడు. ఆ వనంలో ఏం జరిగింది? రైతు స్వర్ణభస్మమూలిక సంపాదించాడా?

అనగా అనగా ఒక గ్రామంలో సుధాముడనే రైతు ఉండేవాడు. అతడి భార్య చంపావతి. అందాలరాశి. ఆమె అంటే అతడికి అపరిమితమైన ప్రేమ. ఒకసారి ఉన్నట్లుండి చంపావతికి పెద్దజబ్బు చేసింది. అప్పట్నించి ఆమెకు అన్నం సహించటం లేదు. క్రమక్రమంగా మనిషి క్షీణించి పోసాగింది. ఆ గ్రామంలోని చండీదాసుడనే ఘనవైద్యుడు చంపావతిని పరీక్షించి ‘‘మందు తయారుచేస్తాను. అందుకు స్వర్ణభస్మం అవసరం. పదివేల వరహాలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు తేగలవా’’ అన్నాడు.సుధాముడు దీనంగా అతణ్ణిచూచి, ‘‘నా ఇల్లు, పొలం అమ్మినా అంతడబ్బు రాదు. అంతడబ్బు నేనెక్కణ్ణించి తేగలను? దయతో మరేదైనా ఉపాయం చెప్పండి’’ అని వేడుకున్నాడు. చండీదాసుడు తనవద్దనున్న వైద్య గ్రంథాలన్నీ తిరగేసి, ‘‘నీవు చాలా అదృష్టవంతుడివి. చంపకవనంలో ఉండే పది బంగారు పిచుకలగూళ్లుతెచ్చి మంట పెట్టాలి. నీ భార్య ఆ మంటవద్ద చలికాగితే ఈ జబ్బు తగ్గుతుంది. అయితే, అందుకు మాసంరోజులు మాత్రమే గడువున్నది. వైద్యం ఆలస్యమైతే నీ భార్య ప్రాణాలు పోతాయి’’ అన్నాడు.

ఆ గ్రామంలోనే శోభనాద్రి అనే సంపన్నుడు ఉన్నాడు. చిన్నతనంలో సుధాముడు, శోభనాద్రి కలిసి చదువుకున్నారు. సుధాముడు శోభనాద్రి దగ్గరకివెళ్లి, తన పరిస్థితి చెప్పుకుని, ‘‘నేను చంపకవనం నుంచి తిరిగి వచ్చేంతవరకూ నీవు నా భార్యను కనిపెట్టుకుని ఉండాలి’’ అని కోరాడు.‘‘చంపకవనానికివెళ్లి ఒక మాసంరోజుల్లో వెనక్కు రావడం అసాధ్యం. నామాటవిని ఆమెకు స్వర్ణభస్మ వైద్యం జరిపించు’’ అని సలహా ఇచ్చాడు శోభనాద్రి. ‘‘నా దగ్గర అంత డబ్బు లేదు’’ అన్నాడు సుధాముడు.‘‘ఒక షరతుమీద నేనా డబ్బు ఇస్తాను’’ అన్నాడు శోభనాద్రి. సుధాముడు ఎంతో ఉత్సాహపడి, ‘‘నా భార్యకోసం ఏమైనా చేస్తాను. అమె నా పంచప్రాణాలు. నీ షరతు ఏమిటో చెప్పు’’ అన్నాడు.