విలువల్ని పెంచే కథల సిలబస్‌

 ‘విద్యార్థికి పాఠం ఎలా బోధించాలి’ అనే అంశంపైన నలిగిపోయిన ప్రణాళికలు చాలానే ఉన్నాయి. కానీ ఈ కథావాచకం చదివితే ఉపాధ్యాయుడికి ఉండవలసిన బోధనానైపుణ్యాల మీద విభిన్న కోణాలలో సృజనాత్మక అవగాహన కలిగిస్తుంది. అక్షరాస్యత, విద్య, జ్ఞానం అంటూ ఎంతో లోతుగా చర్చలు, విశ్లేషణలు, ప్రచారాలు జరిగాయి. అటువంటి విద్యావేత్తల మేధోమథనానికి దీటుగా రూపొందిన కథలు ఇవి. ప్రతి కథ వెనుక ఒక అంతర్నిగూఢ సత్యాన్ని పొందుపరిచాడు కథకుడు. విద్యావ్యాపారమైన ప్రపంచంలో యాంత్రికమయ విద్యావ్యవస్ధ ఆలోచనా రాహిత్యాన్ని, భావ దారిద్ర్యాన్ని నింపుతున్న తరగతిగది గోడల్ని కూల్చివేసి... ప్రకృతి పాఠశాలలోకి నడిపిస్తాయి ఈ కథలు. బోధనలో సృజనాత్మకతను ఏ విధంగా నింపుకోవాలనేదానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. కథానుభూతిని అందిస్తూనే కర్తవ్య నిర్వహణలో అనుసరించవలసిన వ్యక్తిగత వ్యూహాల్ని బోధిస్తాయి. ప్రతి అధ్యాపకుడు అధ్యయనం చేయవలసిన కథలివి. రచయితకు నూటొక్కమార్కు పడుతుంది.

 

- డా.ఎస్‌. రఘు
 

నూటొకటోమార్కు (సిలబస్‌లో లేని కథలు)

రచయిత : జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

పేజీలు : 128, వెల : రూ. 100, ప్రతులకు : నవోదయ బుక్‌