అనుభూతుల నోస్టాల్జియా

శిఖామణిది నులివెచ్చని కవిత్వస్పర్శ. మంద్రమైన భావచిత్రాలతో హృదయాలకు తడిని అద్దగల వాక్యం తనది. పరాయీకరణలోంచి ఆత్మమూలాలను పట్టుకొని యానాం స్మృతులను పలవరిస్తున్నాడిప్పుడు. ‘‘యానాం కవితలు’’ పేరిట తన ఉనికిని, చరిత్రను, సాంస్కృతిక అస్తిత్వాన్ని, బంధాలను.. మనస్సులోతుల్లోంచి యాధాతథంగా తవ్విపోస్తున్నాడు. ‘నాయనా! / నువ్వు నా పద్య శరీరానివ’ని తండ్రిని తలపోస్తాడు. ‘అల్లాఉద్దీన్‌ అద్భుత దీపమా / గుక్కపట్టిన బిడ్డనోటిస్తన్యమా / నా కన్నతల్లి యానమా’ అని ఊరిని కలవరిస్తాడు. ‘యానం సరస్వతి’, ‘ఆరణాల షాఫు’, ‘రంగూన్‌ సన్నెకల్లు’, ‘మావూరి మరిడమ్మ’, ‘కొయ్యకాలు’, ‘పలకల లాంతరు’... ఇలా ప్రతి కవితా శిఖామణి జ్ఞాపకాల్లోంచి ఊడిపడిందే. పుస్తకం చివరిచ్చిన కవితానేపథ్యాలు పాఠకుల్ని శిఖామణి గుండెకు మరింత దగ్గర చేస్తాయి.

- ఎ. రవీంద్రబాబు

 

యానాం కవితలు (కవిత్వం), 

రచన: శిఖామణి

పేజీలు: 211, వెల: రూ. 150,

 ప్రతులకు: 9848202526