అనగనగా ఓ రాజు. ఆ రాజు పేరు సుదర్శనుడు. అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. అదేమిటంటే... నలుగురు కొడుకులున్నారతనికి. ఆ కొడుకులికి ఆటలంటే ఇష్టం. పాటలంటే ఇష్టం. చదువంటేనే ఇష్టం లేదు. బాగా చదువుకుని, శాస్త్రాలని ఒంటబట్టించుకుంటేనే కదా, గొప్పవారూ, రేపటి రాజులవుతారు. కాని చదువంటేనే ఇష్టం లేదు వాళ్ళకి. అలా అని శుద్ధ మొద్దులా అంటే కాదు, బుద్ధిమంతులే!రాజుగారు ఈ బాధలోనే కొలువు తీరారు. పండితులతోనూ, విద్వాంసులతోనూ రకరకాల చర్చలు చేశారు. ఆ సందర్భంలో ఓ పండితుడు ఇలా అన్నాడు.‘‘మనిషి డబ్బుతోనూ, అధికారంతోనూ, యవ్వనంతోనూ, అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఈ నాలుగింట దేనితోనయినా చెడిపోయే ప్రమాదం ఉంది. కలగలిసి నాలుగూ ఉన్న వాడూ ఇటే ్ట చెడిపోతాడు. అందుకనే మనిషన్నవాడు బాగా చదువుకోవాలి. చదువుకుంటే తెలివితేటలూ. వివేకజ్ఞానం అలవడి, చెడిపోకుండా ఉంటాడు. మనిషికి విద్య కన్నులాంటిది. ఆ కన్ను లేకపోతే కష్టం. బతుకంతా చీకటే’’పండితుని మాటలతో రాజు బాధ రెట్టింపయింది. కొలువు చాలిస్తున్నామని చెప్పి, చరచరా అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాజు, కొలువుని ఇలా మధ్యలో ముగించిన సందర్భాలు లేవు.

ఉత్సాహంగా కొలువు తీరే రాజు, ఇటీవల నిరుత్సాహంగా కొలువు తీరడం, ఏదో బాధలో ఉన్నట్టుగా కనిపించడం పండితుల్నీ, విద్వాంసుల్నే కాదు, మంత్రి రాజదత్తుణ్ణి కూడా కలచి వేసింది.పిల్లల అరుపులూ కేకలూ వినవస్తోంటే అంతఃపురం కిటికీలో నుండి కిందకి చూశాడు రాజు. ఉద్యానవనంలో తన నలుగురు కొడుకులూ అల్లరిగా ఆడుకోవడం కనిపించింది. కన్నీళ్ళొచ్చాయతనికి. ఎంచక్కా చదువుకున్నవారు పిల్లలు కాని, వీళ్ళేం పిల్లలు? వీళ్ళ వల్ల తల్లిదండ్రుకు పేరు ప్రఖ్యాతులు రావు సరికదా, దుఃఖం ముంచుకొస్తుంది. తళుకు బెళుకు రాళ్ళు తట్టెడు ఉండడం కన్నా, ఒక్క రత్నం చాలంటారు. అలాగే కౌరవ సంతానంలా వందమంది మూర్ఖులు కొడుకులుగా ఉండే కంటే ఒక్కడు... ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడు, ధర్మరాజులాంటి వాడు ఉంటే చాలనుకున్నాడు రాజు. దేనికయినా ప్రాప్తం ఉండాలి. గుణవంతులూ, విద్యావంతులూ అయిన పిల్లలుండాలంటే గతజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలనుకున్నాడు. అంతలోనే కళ్ళు తుడుచుకుని, దీర్ఘంగా ఆలోచించసాగాడు.-కథలు ముగించాడు దమనకుడు. సమాధానం కోసం సంజీవకుణ్ణి చూశాడు.