కళ్ళు చెమర్చుకున్నాడు రాముడు.‘‘నీకు తెలియదు నాన్నా! కైకను పెళ్ళి చేసుకున్న దగ్గరనుంచీ నీ తండ్రి నన్ను పట్టించుకోవడం మానేశాడు. పేరుకే పెద్ద భార్యను. నిజానికి దాసీ దానికంటే హీనంరా! ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు అనుభవించానో ఆ భగవంతుడికే తెలుసు.’’‘‘అమ్మా’’ అన్నాడు రాముడు.‘‘నువ్వు యువరాజైతే నేను రాజమాతనను కున్నాను. సుఖపడతాననుకున్నాను. పదిహేడేళ్ళుగా కంటున్న కల నాయినా ఇది. నా కల కాలిపోయింది. నా ఆశ నిరాశ అయింది. ఇక బతికి ప్రయోజనం లేదు. ఇంతటి ఘోరవార్త విని కూడా బతికి ఉన్నానంటే, నేను మనిషిని కాను, రాయిని, బండరాయిని.’’ నెత్తి కొట్టుకుంది కౌసల్య.‘‘తల్లీ’’‘‘నువ్వు అడవులకు వెళ్ళిపోతే నేనిక్కడ ఉండ గలనాచెప్పు? ఈ సవతులు నన్ను ఉండనిస్తారా చెప్పు? నాన్నా! నీతో పాటు నేను కూడా అడవులకు వచ్చేస్తాను. నన్నూ తీసుకుపో! దూడవెంట ఆవులా నీ వెంట నేనుంటాన్రా, కాదనకు’’ అన్నది కౌసల్య.రాముడు ఆమెను పెనవేసుకున్నాడు. దుఃఖించ సాగారిద్దరూ. ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు లక్ష్మణుడు. చేత్తో నుదుటిని పదేపదే కొట్టుకున్నాడు.‘‘స్వార్థపరురాలమ్మా! కైక మహా స్వార్థపరురాలు. తన స్వార్థం కోసం అన్నను బలిచేస్తోంది. ఆమె మాట పట్టుకుని అన్నయ్య అడవులకు వెళ్ళడం తప్పు, నేను ఒప్పుకోను. మహారాజు ముసలి వాడైపోయాడు. ఆ నంగనాచి వలలో పడిపోయాడు. పడిపోయి, ఆమె ఆడించినట్టల్లా ఆడి, అన్నను శిక్షిస్తున్నాడు. రామన్న చేసిన తప్పేంటమ్మా? ఏ పాపం చేశాడని? ఎవరిని హింసించాడని?’’ అడిగాడు లక్ష్మణుడు. 

కౌసల్యను దగ్గరగా తీసుకున్నాడు.‘‘అన్నా! నువ్వు వనవాసానికి వెళ్ళొద్దు. ఒకవేళ తప్పదనుకుంటే నీ కంటే ముందు నేను వనవాసానికి బయల్దేరుతాను. నేను చేసిన పుణ్యం మీదా, నా శస్త్రాస్త్రాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నువ్వెక్కడ ఉంటే నేనూ అక్కడే! నిజం అన్నా, ఇది నిజం.’’ అన్నాడు లక్ష్మణుడు. రాముని గుండెల్లో ఒదిగిపోయాడు. ఇటు తల్లి, అటు తమ్ముడు... ఇద్దర్నీ చెరో చేత్తో పట్టుకుని కుమిలిపోయాడు రాముడు.‘‘అన్నా’’ కన్నెర్ర చేసుకున్నాడు లక్ష్మణుడు.‘‘పదిమందికీ నీ అరణ్యవాసం తెలియక ముందే పద, రాజ్యాన్ని స్వాధీనం చేసుకుందాం. నీ ముందు ఆ యముడు కూడా నిలబడలేడు. నువ్వు బాణాన్ని సంధిస్తే, తండ్రేకాదు, తాతలు కూడా భయపడాల్సిందే! నీకు తోడుగా నేనుంటాను. మనిద్దర్నీ గెలవగలిగిన వారు ఈరాజ్యంలోనే లేరు, నా మాట విను, యుద్ధానికి పద’’‘‘లక్ష్మణా’’ ఆశ్చర్యపోయాడు రాముడు.‘‘భరతుడూ, వాళ్ళ తాత కేకేయరాజూ వాళ్ళందరి సంగతీ నేను చూసుకుంటాను. ఒకొక్కరినీ కత్తికో కండగా నరికి పోగులు పెడతాను. ఆలో చించకు, ఆలస్యం చెయ్యకు, పదన్నా, యుద్ధానికి పద.’’‘‘తమ్ముడూ’’‘‘బలంతోనూ గర్వంతోనూ విర్రవీగే గురువును సైతం ఎదురించడం క్షాత్రధర్మం. అందులో తప్పులేదు. కైక మాటలకు తండ్రి తలొగ్గాడు. ధర్మం తప్పాడు. అటువంటిరాజును బతకనీయకూడదు. నువ్వు ఊఁ అను, తండ్రి అని కూడా చూడకుండా మహారాజును నేను చంపుతాను. కాదంటే బంధించి చెరలో పెడతాను’’ అన్నాడు లక్ష్మణుడు.

రాముని పట్టు విడిపించుకుని లేచి నిల్చున్నాడు. ముందుకు అడుగువేయబోయాడు.‘‘లక్ష్మణా’’ అన్నాడు రాముడు. లక్ష్మణుణ్ణి బలంగా పట్టి నిలిపాడు. ఊహకందని ఆలోచన. ఊహించని పరిణామం. పుత్రప్రేమ ముందు పతిభక్తి దూదిపోగులా ఎగిరిపోయింది. కన్నీరు తుడుచుకుని కౌసల్య అన్నదిలా.‘‘రామా! తమ్ముడుచెప్పిందాంట్లో తప్పులేదు. అయితే మంచి చెడులు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకో! వనవాసానికి పోతానంటే మాత్రం నేనూరుకోను. తండ్రి మాటే వేదవాక్కు అనుకోకు, తల్లి మాట కూడా పిల్లలు పాటించాలి. నిన్ను నేను తొమ్మిది నెలలు మోశానురా, మోసి మరీ కన్నాను.’’ అన్నది కౌసల్య.‘‘అమ్మా’’‘‘కశ్యపమునికి తల్లే దేవత. ఆమెను సేవించే ఉత్తమలోకాలందుకున్నాడతను. అందుకని నా మాట కూడా నువ్వు వినాలి. నీ అరణ్యవాసాన్ని నేను ఒప్పుకోను. రాజ్యంపోతే పోయింది. వద్దనుకుందాం దాన్ని. నువ్విక్కడే ఉండు, నా మందిరంలో ఉండు. ఇద్దరం కలో గంజో తాగి బతుకుదాం.’’ అన్నది కౌసల్య. ‘‘అదికాదమ్మా...’’రాముని మాటకు అడ్డుపడింది కౌసల్య.‘‘తండ్రి మాటను గౌరవిస్తూ నువ్వు వనవాసానికే వెళ్తానంటే, ఈ తల్లిని మరచిపో! నీకిక ఈతల్లి లేదనుకో! నువ్వు అటు అరణ్యవాసానికి బయల్దేరిన మరుక్షణం నేనిటు ప్రాయోపవేశం చేస్తాను. మంటల్లో దూకి మరణిస్తాను. తల్లిని చంపుకున్న పాపం, బ్రహ్మహత్యకంటే పెద్దది. అది నిన్ను దహించేస్తుంది’’ అన్నది కౌసల్య.యుద్ధం చేద్దామంటూ లక్ష్మణుడు, చచ్చిపోతానంటూ తల్లి... ఆ ఇద్దరి మధ్యా నిస్సహాయంగా నిల్చున్నాడు రాముడు. కళ్ళు మూసుకుని ఆలోచించ సాగాడు.