డా. కేవీ రమణాచారి 
జానపద కళాకారులకు నగదు పురస్కారం అందజేత

రవీంద్రభారతి, జూన్‌ 24 (ఆంధ్ర జ్యోతి): కళలను, కళా సంస్థలను ప్రోత్సహించడంతో పాటు నిరుపేద కళాకారులకు నగదు బహుమతులు అందజేస్తున్న కళాపోషకుడు సారిపల్లి కొండలరావు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి అన్నారు. ఒక్క కళాకారుడు సంతోషంగా ఉంటే ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని అన్నారు. సోమవారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో యువకళావాహిని సంస్థ, సారిపల్లి ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు జన్మదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత కళ పురస్కారాలతో పాటు తెలంగాణ జానపద కళల నగదు పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. లలిత కళల కళాకారులు కొమండూరి శేషాద్రి, విన్నకోట మురళీకృష్ణ, పత్తిపాక మోహన్‌, తిరునగరి, కళాకృష్ణ, రామచంద్రరావు, ఎస్‌.ఎం.బాషా, ఎం.వి.సింహాచల శాస్త్రి, ఉడయవర్లు తదితరులకు లలిత కళా పురస్కారాలు. ఎ.శంకర్‌, బీమయ్య, హనుమగౌడ్‌, మరోని, అహ్మద్‌ అలీ, కొండల్‌రావు, వరమ్మ, బ్రహ్మయ్య, రాజన్న, సిద్ధయ్యలను నగదు పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణాచారి పురస్కారగ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలను కాపాడుకోవాల్సిన అవసరముందని అన్నారు.

సభాధ్యక్షత వహించిన మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతి తెలుగు కళాకారుడు గర్వించదగిని వ్యక్తి సారిపల్లి కొండలరావు అని అభివర్ణించారు. కళలకు ఇంతటి ప్రోత్సాహం లభిస్తే కళాకారులు సంతోషంగా ఉంటారని అన్నారు. సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ కళలపై తనకున్న ఇష్టమే ప్రోత్సహించేలా చేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి ఎస్‌.వేణుగోపాలచారి, తెలంగాణ సంగీత నాటక అకాడమి చైర్మన్‌ బి.శివకుమార్‌ మాట్లాడుతూ కళాకారులకు ప్రభుత్వం, సాంస్కృతిక సంస్థల ద్వారా ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కళకారుల పక్షపాతి అని అన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్త పాలకుర్తి మధుసూదనరావు, భారతీయం సత్యవాణి, సినీ నటి గీతాంజలి, కళ పత్రిక సంపాదకులు మహ్మద్‌ రఫీ, వై.కే.నాగేశ్వరరావులతోపాటు ప్రముఖులు పాల్గొన్నారు.