దర్శకుడు ఆదూర్‌ విమర్శ

భాగ్యనగర సాహితీ పండుగ షురూ

సాహిత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు వేదిక

150 కార్యక్రమాలు, 200మంది అతిథులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి24 (ఆంధ్రజ్యోతి): మంచి సినిమాలు విడుదల కానివ్వకుండా మన ప్రభుత్వాలే అడ్డుపడుతున్నాయని ప్రఖ్యాత మలయాళ దర్శకుడు ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ అన్నారు. సినిమా మంచి, చెడులను నిర్దేశించడంలో రాజకీయ పార్టీల జోక్యం పెరగడంవల్ల ఉత్తమ చలనచిత్రాలు సైతం ప్రేక్షకులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకీ, సాహిత్యానికీ మధ్య దూరం బాగా పెరిగిందని చెప్పారు. ఒకప్పుడు నవలలను చిత్రీకరిస్తే, ఇప్పుడు హోటల్‌ గదులలో సినిమా కథలు పుడుతున్నాయని విమర్శించారు. శుక్రవారం ఇక్కడ పదో హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. మూడురోజుల సాహితీ పండుగకు ముఖ్యఅతిథిగా గోపాలకృష్ణన్‌ హాజరయ్యారు. విదేశాలతో పోలిస్తే భారతీయ సినిమాలో వాస్తవిక జీవిత ఛాయలు చాలా తక్కువని అభిప్రాయపడ్డారు.

యథార్థ జీవితాలను ప్రతిబింబించే సినిమాలు విజయవంతం కావనే అభిప్రాయం మన దర్శకుల్లో ఉందని అన్నారు. నేటి పరిస్థితులలో మంచి సినిమా తీయడం చాలా కష్టమని చెప్పారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలప్పుడు ‘పొగతాగడం కేన్సర్‌ కారకం’, ‘మద్యపానం ప్రాణాంతకం’ తదితర హెచ్చరిక రాతలు కళాత్మక సినిమాలకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయన్నారు. సినిమాలలో హింసను అతిగా చూపించడాన్ని ఆయన విమర్శించారు. మరో ముఖ్య అతిథి చెన్నైలోని ఆస్ట్రేలియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ సుసన్‌ గ్రేస్‌ మాట్లాడుతూ ఒక దేశ సాహిత్యం చదవడంద్వారా, ఆ దేశ సామాజిక, సాంస్కృతిక స్థితిగతులను తెలుసుకోవచ్చని అన్నారు. తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మలయాళంలో మాట్లాడి సభికులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో కార్వే గ్రూపు డైరెక్టర్‌ అధిరాజ్‌ పార్థసారఽథి, ఫెస్టివల్‌ డైరెక్టర్‌ అమితా దేశాయ్‌, విజయ్‌కుమార్‌, అజయ్‌గాంధీ పాల్గొన్నారు.

తొలిరోజు సందడి..!

200 మంది అతిథులు, 150 కార్యక్రమాలతో మూడు రోజులపాటు భాగ్యనగర సాహితీ పండుగ సాగుతుంది. తొలిరోజు ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ వక్తగా సినీనటుడు అనీశ్‌ కురువెళ్ల నేతృత్వంలో ‘‘సినిమా, సాహిత్యం-సమాజం’’ అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. ఈ ఏడాది విదేశీ అతిథులుగా ఆస్ట్రేలియా సాహితీవేత్తలు వచ్చారు. ‘‘కశ్మీరు గందరగోళం’’ అనే అంశంపై ప్రముఖ కశ్మీరీ జర్నలిస్టు గౌహర్‌ గిలానీ మాట్లాడారు.