మలయాళీ కవికి జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు


అక్కితమ్‌ పేరును ఖరారు చేసిన బోర్డు
న్యూఢిల్లీ, నవంబరు 29: ప్రముఖ మలయాళీ కవి అక్కితమ్‌ ప్రతిష్ఠాత్మక జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు దక్కింది. 2019 ఏడాదికిగానూ అక్కితమ్‌ పేరుని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్ఞాన్‌పీఠ్‌ సెలెక్షన్‌ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఆయన పూర్తిపేరు అక్కితమ్‌ అచ్యుతన్‌ నంబూద్రి. 1926లో జన్మించిన ఆయన మలయాళ కవిత్వంలో తనకంటూ గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కవిత్వంతోపాటు సాహిత్యం, నాటక రంగం, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, అనువాదం తదితర రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ‘అక్కితమ్‌ కవిత్వం కరుణను ప్రతిబింబిస్తుంది. భారతీయ తాత్విక, నైతిక విలువల ముద్రలు కనిపిస్తాయి. సంప్రదాయ, ఆధునికతకు మధ్య వంతెనలా ఉంటూ.. వేగంగా మారుతున్న సమాజంలోని మానవ భావోద్వేగాలను లోతుగా వివరిస్తాయి.
 
 
ఆయన రచనలన్నీ క్లాసిక్‌‌గా నిలుస్తాయి’ అని జ్ఞాన్‌పీఠ్‌ సెలెక్షన్‌ బోర్డు చైర్మన్‌ ప్రతిభా రే తెలిపారు. అక్కితమ్‌ 55 పుస్తకాలు రచించారు. వాటిలో 45 పద్యాలతో కూడిన ‘ఖండ కావ్యాలు’, ‘కథా కావ్యాలు’, ‘చరిత కావ్యాలు’, పాటలు ఉన్నాయి. ఆయన రచించిన వాటిలో ‘వీరవదమ్‌’, ‘బలిదర్శనమ్‌’, ‘నిమిష క్షేత్రమ్‌’, ‘అమృత ఖటిక’, ‘అక్కితమ్‌ కవితక’, ‘ఎపిక్‌ ఆఫ్‌ ట్వంటీయత్‌ సెంచరీ’, ‘అంతిమహాకలమ్‌’ బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. సాహిత్య రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గానూ సాహిత్య అకాడమీ అవార్డు (1973), కేరళ సాహిత్య అకాడమీ అవార్డు (1972, 1988), మాతృభూమి అవార్డు, కబీర్‌ సమ్మాన్‌, వయలార్‌ అవార్డులు అందుకున్నారు. ఆయన రచనలు అనేక భారతీయ, విదేశీ భాషల్లోనూ అనువాదమయ్యాయి.