విశ్వనరుడు జాషువాది గూడెం పర్యావరణం. అవర్ణ మహిళావరణం. నాలుగు గోడలులేని నివాసాలతో, వంట యిండ్లేకాదు, అసలు యిండ్లేలేని ఆవరణాలు. మొగుడు సచ్చిపోతే, అతనితోపాటు చావాల్సిం దేననే ‘సతి’ అమానవీయాలు లేని, మహిళలకు మారు మనుములు, వితంతు వివాహాలు, విడాకులు సజావుగా జరిగే ఆవరణం. పొద్దునలేసి ఆడ, మగ బైటకు కూలినాలికురికే పర్యావరణం. పేదరికం, అంటరానితనం, ఆకలి, వెట్టి, అవిద్య, శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీ వ్యవస్థీకృతంగా మహిళలు ఎదుర్కొం టున్న దుస్థితివున్న పర్యావరణంలో జాషువా పుట్టి పెరిగిండు. ఇవన్నీ జాషువాని పేదల పక్షపాతిగా, మహిళా జన పక్ష పాతిగా నిలిపినయి. జాషువా స్త్రీ పాత్రల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ఆయన ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కొత్త లోకం, ఖండ కావ్యాలు అద్దం పడతాయి. ఆయన తన రచన లను చాలా వరకు తల్లి, భార్య, బిడ్డలకు, యితర మహిళ లకు అంకితమిచ్చి, మహిళల పట్ల తన ఆత్మీయతల్ని, ఔదార్యాన్ని చాటుకు న్నడు. గూడెం మహిళలు ప్రకృతిని, మానవజాతిని సమం గా చూసే దార్శనికతలను చూసిండు.
ఊరి ఆసామితో ఎన్ని సెరలబడ్డా, ఆసామి సచ్చిపోతే పోయి, యేడిసొచ్చే గూడెం మహిళల మానవీయతను, ఉదారతా మానవ సంబంధాలనూ జాషువా చూసిండు. తెలుగునేల మీద ఏ కవిత్వానికీ లేని జనాదరణ, సామాజిక చైతన్యాలు, జెండర్ స్పృహ జాషువా కవిత్వానికున్నయి. తెలుగులో అభ్యుదయ సాహిత్యం (1943) రాకముందే బాధితుల, దళిత మహిళల పేదరికం అంటరానితనాల వివక్షలను సాహిత్యీకరించాడు జాషువా.
వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో మహిళను (కులీన) శృంగార నాయికగా, అష్టవిధ శృంగార నాయికగా వర్ణించే దుష్ట సంప్రదాయాన్ని విడిచి ఆకలితో, పేదరికంతో, అంటరానితనాలతో అలమటించే ఒక దళిత మహిళను కథానాయికగా నిలిపి, 1930లోనే ‘అనాథ’ రచనతో దళిత మహిళకు సాహిత్య గౌరవాల్ని కల్పించాడు జాషువా. సవర్ణ సంస్కర్తలు, రచయితలు తమ మహిళోద్ధరణకై సంస్కరణలు, రచనలు విస్తృ తంగా చేసి, మహిళా పత్రికలు స్థాపించి, తమ మహిలను దుస్థితుల నుంచి విముక్తి గావించి నట్లు, అణగారిన కులాల రచయితలు తమ శ్రామిక మహిళా భ్యున్నతికై రచనలు చేయడం, వారికోసం పత్రికలను ఏర్పాటు చేసి చైతన్యాల్ని వెలుగొందించడం యీ నాటికీ జరగని దుస్థితి.
హంగ్రీ థర్టీస్ (1930)లో ఆర్థికమాంద్యం, ఆకలి నేపథ్యంగా వెలువరించిన జాషువా రచన ‘అనాథ’. దేశంలో ఏ మాంద్యాలొచ్చినా ఎక్కువగా బలయ్యేది దళిత మహిళలు. భర్త చనిపోయి యిల్లు వాకిలి లేక పిల్లలతో వీధినబడిన దళిత మహిళ కథ ‘అనాథ’. అందరికీ సమానంగా చెందాల్సిన ఆర్థిక వనరులు కొద్ది మందికే చేరడాన్ని నిరసిస్తూ... ‘ఎవడారగించు అమృత భోజనంబున/ కలిసెనో యీలేమ గంజి బువ్వ/.... ఎవని దేహము మీది ధవళాం బరములలో/ ఒదిగెనో యిన్నాతి ముదుక పంచె/ ఎవడు దేహము సేర్చు మృదు తల్పములోన/ నక్కెనో యీయమ్మ కుక్కి పడక/ వసుధ పైనున్న భోగ సర్వస్వమునకు స్వామిత వహించి మనుజుండు ప్రభావ మందు/ ఎవడప హరించె? నేమయ్యె నీమె సుఖము?’ -అని దళిత మహిళలకు చెందా ల్సిన కూడు, గుడ్డ, నీడ, ఎవరి సౌఖ్యాల్లోకి చేరినయనేవి పేగులు తెగే ప్రశ్నలు. దళిత మహిళల పేదరికాన్ని ఆకలి అవమానాల జీవనాన్ని, దాని ఆయువుల్ని సమాజ, సాహిత్య పటాల మీద అంత గొప్పగా, బలంగా దృశ్యీ కరించిన ఆవిష్కరణ జాషువా తర్వాత మరే కవికీ సాధ్యం కాలేదనడం అతిశయోక్తి కాదు. స్వప్న కథ, అనాథ రచనల్లో జాషువా ఆర్ద్రత కవిత్వ ప్రవాహంగా పొంగుతుంది.
సామాజికంగా, సాంస్కృతికంగా సవర్ణ హిందూ మగ వ్యవస్థ తమ మహిళల్ని పకడ్బందీగా పితృ స్వామ్య చట్రాల్లో బంధించి మహిళను నోరు లేని జంతువులుగా మార్చింది. ‘నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని శాసించి, యింటి గడప దాటనియ్యకుండా నాలుగ్గోడల మధ్య బంధిం చడమే గాక వారికి కనీసం బతికే హక్కు కూడా లేకుండా ‘సతీ’ హత్యలు చేస్తూ, వితంతు వివాహా లపై, పునర్వివాహాలపై నిషేధాలు పెట్టింది. సవర్ణ మహిళల మీదున్న యీ అమానుష దుర్మార్గ దురాచారాల్ని అంత మొందించడానికి దేశం నలుమూలల నుంచి మతాల నుంచి సంస్కర్తలు, సాహిత్యకారులు పెద్దఎత్తున కృషి చేసినారు. అయితే... ఆధిపత్య సామాజిక, సాహిత్య చరిత్రకారులు సవర్ణ మగ సంస్కర్తల్ని, సాహిత్యకారులనే సాహిత్య చరిత్ర నిండా ప్రస్తుతించినారు.
కానీ ‘పతి మరణింపనాతని శవంబునకున్ సతినంట గట్టి/ సద్గతి లభించునంచు కనికరమొకించుక లేక అగ్ని కాహుతి నొనరించు/ పురుషోత్తముల్ నీ సమున్న తికి ప్రసన్నుడై వదలునా చిరకాలపు హుక్కు పగ్గముల్’ అని సతి దురాచారమ్మీద, స్త్రీలను పుట్టుబానిసల జేసిన సంస్కృతి మీద ‘చల్లారెనే మహాసతుల నాహుతి గొన్న సహ గమనాచార దహనకీల?’ల మీద కవితా ప్రశ్నలు గా ఉదయించి, విరివిగా మహిళోద్ధరణ రచనలు చేసిన జాషువా సంస్కరణ దృష్టిని, సాహిత్య కృషిని విస్మరించి సాహిత్య చరిత్రలను అసమగ్రం చేసినయి.
తెలుగు సాహిత్య చరిత్రలు చూసినా... మహిళోద్ధరణ రచయితలంటే ఆధిపత్య హిందూ కుల గురజాడను, చలంను పేర్కొంటారు. కానీ... ‘‘స్త్రీలను పుట్టు బానిసలను జేసిన సంస్కృతిని’’ తూర్పారబట్టిన జాషువా, ‘‘మగని యాయువు లతో తెగి ముండ మోయించి గేలిగొట్టించబడి’’న మహిళల మీద ఆర్తిగా ఆవేదనగా కవిత్వాలల్లిన జాషువా కనబడడు. జాషువాను కవిత్వాన్ని అవాచ్యం చేసింది మామూలు సాహిత్యకారులే కాదు కమ్యూనిస్టు, అభ్యుదయ, విప్లవ సాహిత్య ఉద్యమ చరిత్రలు; ఫెమినిస్టు, మహిళా సంఘాలు కూడా జాషువా కవిత్వంను వెలి వేసినయి. ‘అబలయన్న బిరుదమంటించి కాంతల/ స్వీయ శక్తులనదిమి చిదిమినారు/ సబలయన్న బిరుదు సాధించి హక్కులు/ గడన చేసికొమ్ము కష్ట చరిత’ అనే జాషువా నవ్య నూతన జెండర్ స్పృహ రచనలు, ఫెమినిస్టు సంఘాలకు కనబడవు, వినబడవు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గుర్తింపుల్లో కూడా యిదే వివక్షలు జరిగినయి. మహిళా బిల్లు రూపొందించి పార్లమెం టులో పెడితే, (సవర్ణ స్త్రీ, పురుషులవల్ల) అది వీగిపోయిన సందర్భంలో తన పదవికి రాజీనామా చేసిన కమిట్‌మెంట్‌ని గుర్తించడానికి ఆధిపత్య కుల ఆడ మగ సమాజాలకు యిప్పటికీ మనసు రాదు. మహిళా బిల్లు వీగిపోయినప్పుడు తెలుగు నేలమీద ఏ కవి కలము కదలలేదు ఒక్క జాషువ కలం తప్ప. ‘‘పరదాలో నిను దాచిపెట్టు కొనుచున్ స్వాతంత్య్ర మావశ్యకం/ బరవిందా క్షుల కంచు వీధుల నుప న్యాసాలు సాగించు ట/ క్కరులే హైందవ కోడు బిల్లు లకు పక్కా ద్వేషులై నిల్చు చుం/ దురు, విద్యానయనంబులేని అలివేణుల్ గానరీ మర్మముల్,’’ అని జాషువ జాలి పడినాడు.
సవర్ణ హిందువులైన రచయితలు తమ పర్యావరణంలోని మహిళా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం మాత్రమే రచనలు చేసినారు. బహుజన కులాల శ్రామిక మహిళా పీడనలు వారికి పట్టని సంగతులు. కానీ జాషువా మొదట అనాథ, స్వప్న కథ రచనలు దళిత మహిళల కోసమ్ రాస్తూ, తన గూడానికి కోసుల దూరం వున్న అగ్రహార మహిళా విముక్తికి, విస్తార రచనలు చేసిన మానవీయ విశ్వనరుడు!
సవర్ణ స్త్రీలను ఉద్దేశించి జరిగిన సంస్కరణలు జనరలైజ్ చేయడం వల్ల నష్టపోయింది శ్రమ కులాల/బహుజన మహిళా సమాజం. దళిత మహిళలపై జరిగే సామాజిక కుల, జెండర్ పీడనలు, దుర్మార్గాలు, హింసలు స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలైనా యింకా సమసిపోని వ్యవసీ ్థకృత పీడనలు. ఈ మహిళా దురాచార దుర్మార్గాల నిర్మూ లనకు ఎంతో మంది సావిత్రి బాయి పూలేలు, జ్యోతిరావు పూలేలు, అంబేడ్కర్‌లూ, జాషువాలు రావాల్సి వుంది.
జూపాక సుభద్ర