చిక్కడపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కవులు, రచయితలు, కళాకారులు సమాజానికి దిక్సూచిగా పనిచేయాలని బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాష్‌ అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లి సుం దరయ్య విజ్ఞాన కేంద్రంలో అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ప్రముఖ బహుజన వాగ్గేయకారుడు మచ్చ దేవేందర్‌ ఆధ్వర్యంలో ‘మాట-పాట-ఒక్కపూట’ కార్యక్రమం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారగ్రహీత డాక్టర్‌ పసునూరి రవీందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నల్లా సూర్యప్రకాశ్‌ పాల్గొని మాట్లాడారు. కవులు, రచయితలు కూడా రాజకీయపరంగా ఆలోచించాలని, అప్పుడే సమాజాని కి దిక్సూచిగా నిలుస్తారని సూచించారు. మచ్చ దేవేందర్‌ పాటలు బహుజన ఉద్యమవ్యాప్తికి దోహదపడుతాయన్నారు. ప్రముఖ కవి, రచయిత డాక్టర్‌ జిలుకర శ్రీనివాస్‌ మాట్లాడుతూ పాట, రచించే కవిత్వం సమాజాన్ని నిత్యచైతన్యంగా ఉంచుతాయన్నారు. కవులు, రచయితలు సమాజానికి మార్గదర్శకులుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ప్రొ. వైబీ సత్యనారాయ ణ, జీహెచ్‌ఎంసీ డీఎంసీ తిప్పర్తి యాదయ్య, ఇబ్రాం శేఖర్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, గోగు శ్యామల, శరత్‌, అరుణక్వీన్‌, రాచకొండ రమేష్‌, రమేష్‌, రాజేష్‌ పాల్గొన్నారు.