పిందెనో పిండాన్నో

నిలుపుకోలేనినా గర్భాశయం
పదుగురాడు మాటల్లో
పాపాన్ని మోస్తున్న 
ఓ నిరుపయోగ అంగం...
 
మూడు రోజుల
రక్తప్రవాహధారలతో
అలసిపోతున్న ఆ ద్వారం
జీవాన్ని దూర్చుకోలేని 
ఒకానొక జీవరహిత గొట్టం...
 
వంశాభివృద్ధి పేటికలో
ఇప్పుడది సర్వప్రయోగాలకు సిద్ధం
మంత్ర తంత్ర ఆవాహనలలో
అదో రాలని చింతకాయ
 
తావీదు మహిమలతోనూ
అర్ధరాత్రి ప్రార్థనల జాగరణలతోనూ
మేలుకోని జడపదార్థం
 
ఎవరక్కడ
అయ్యో... ఇం...కా...నా
అనే జాలి చూపులలో నన్ను కాలుస్తోంది
మొగుడు మగాడు కాదనే
నిర్ణయాన్ని తీసేసుకుని
మీ పుంసత్వ పరీక్షలతో
బలిచేయ ప్రయత్నిస్తోంది
అక్కరలేని బీజాలు అందించి
అర్థరహిత గర్భాన్ని నాచే
మోయించాలని చూస్తోంది
 
మాటల మత్తో
మందుల విషమో
నా నరనరానా జీర్ణింపచేసి
ఇంటిపేరు ఊరుపేరుల గోలల్ని
నాపై రుద్ది
నన్ను సమాజ బలిపీఠాన్ని ఎక్కిస్తోందిబ
తికున్న శవాన్ని చేస్తోంది
నాలో మిగిలున్న ఆడతనాన్ని చంపేస్తోంది
 
ఆగండక్కడే....
నా గర్భస్థానపు పునాదులపై
వ్యాపారసామ్రాజ్యాలు విస్తరించుకోవడం ఆపండి
పేరుకుపోయిన 
జాతి మత కుల
అహంకార ఆజ్ఞలతోనా తొమ్మిది నెలల జీవిత కాలాన్ని
శాసించకండి
 
తల్లి కాలేని ఆడది
ఆడదే కాదని
అసలు మనిషే కాదని
తలాక్‌ తలాక్‌ తలాక్‌ అనే నోళ్లకు తాళం వేయండి
నూరు మార్కుల జీవిత పరీక్షలో
నన్ను సగానికి దిగువన కట్టేయకండి
నా శీలాన్ని వేలానికి ఒప్పించకండి
 
అమ్మ కావడం వరమే
కానీ...
అమ్మకాలేనితనాన్ని 
శాపపు ఖాతాలో వేసి
నన్ను వేధించకండి
నా మానాన్ని 
నా అభిమానాన్ని
సద్యోగర్భపు బజారులో
ఉరితీయకండి....
 
సుధా మురళి,
94913 11049