ముషీరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కవిత్వం సమాజాన్ని చైతన్యవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో రాష్ట్ర బీసీ టీచర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వాసంతోత్సవ రాష్ట్ర స్థాయి కవిసమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ టీచర్స్‌ యూనియన్‌ వ్యవస్థాపకుడు వెంకటనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. సాహిత్య ప్రక్రియలో కవిత్వానికి విశిష్ట స్థానం ఉందన్నారు. సాహిత్యం కవిత్వ సంబంధిత విషయాలలో పటిష్ట భాగస్వామ్యం కొనసాగించిందని, ఆ స్థానం మరింత పెంపొందించాల్సిన బాధ్యత కవులు, రచయితలపై ఉందన్నారు. కవిత్వం మానవ జీవితాన్ని ప్రభావితం చేసి వికసింపజేయాలని అన్నారు. కవులు ఎప్పటికప్పుడు సమకాలిన సమాజాన్ని ఆకళింపు చేసుకుని ప్రభావితం చేసే శక్తిగా ఎదగాలని సూచించారు. కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి ప్రముఖ కవులు కె.వీణారెడ్డి, ఎస్‌.జయంతి, సరోజన వింజామర, కందేపి రాజ్యలక్ష్మి, పున్న విజయలక్ష్మీ, మూర్తిశ్రీదేవీ, రజనీకులకర్ణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఆర్‌.కృష్ణయ్య ఘనంగా సన్మానించారు.