కల్చరల్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): నాటకాభిమానులకు తాజా విందుగా హైదరాబాదీలకు సరికొత్తనాటకాన్ని రసరంజని వారు వేదిక పైకి తీసుకువస్తున్నారు.  2017 నంది నాటక ఉత్సవాల్లో 3 బహుమతులతో పాటు పలు పరిషత్‌ పోటీల్లో అత్యుత్తమ నాటకంగా ఎంపికైన   ‘దాతా నీకు దండమే’ అనే నాటకాన్ని ప్రదర్శించనున్నారు. టికెట్‌ కొని నాటకం చూసేలా తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేయాలని  26 సంవత్సరాలుగా కృషి చేస్తున్న రసరంజనివారి నెలవారీ నాటక ప్రదర్శనల్లో భాగంగా ఏప్రిల్‌ కానుకగా ఆ నాటకాన్ని చూపించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని తుళ్లూరుకు చెందిన ఎం. మధు రచన, దర్శకత్వంలో ‘దాతా నీకు దండమే’ నాటకం పొరుగువాడికి సాయం చేసే మంచిమనుషుల కథను కళ్లముందుంచబోతోంది. 

ప్రతి పల్లెలో, పట్టణంలో అందరికీ తారసపడే బడి, గుడి, ఆస్పత్రి, గ్రంథాలయంవంటివి అందించిన దాతల వల్ల మనకు ఒనగూడిన మేలును ఇతివృత్తంగా మలిచారు. సంపన్నుల నుంచి యాచకుల వరకు కాసింత మంచి చేయాలన్న తపన ఉంటే సకలజనుల శ్రేయస్సు సుసాధ్యం అనే సందేశాన్ని ఆయా పాత్రల ద్వారా  అందించనున్నారు. ఆబిడ్స్‌లోని బొగ్గులకుంట చౌరస్తా సమీపంలో తెలంగాణ సారస్వత పరిషత్‌ హాల్‌లో 20, 21 తేదీల్లో సాయంత్రం 6.30కు ఆ నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ‘20 రూపాయల టికెట్‌ కొనండి, నాటకం చూడండి.. మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహం’ అంటూ రసరంజని వారు ఆహ్వానిస్తున్నారు.