చిక్కడపల్లి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి గర్వించదగ్గ సాహితీవేత్తల్లో ప్రముఖుడిగా విరాజిల్లిన వ్యాకరణ పండితుడు వఝుల చిన సీతారామశాస్త్రి అని సమాచార హక్కు చట్టం కమిషనర్‌ బుద్దా మురళి అన్నారు. మంగళవారం రాత్రి త్యాగరాయ గానసభలో వఝుల చిన సీతారామశాస్త్రి జయంతి సభ జరిగింది. బుద్దా మురళి మాట్లాడుతూ సీతారామశాస్త్రి ‘ఆంధ్ర శబ్ద చింతామణి’, ‘వికృతి వివేకం’ లాంటి వ్యాకరణ గ్రంథాలపై పరిశోధనలు చేసి తెలుగుజాతికి సులభంగా సరళంగా సూత్రీకరించిన గ్రంథాలను అందించారన్నారు. ఆయన రచనల్లో ద్రావిడ భాషా పరిశీలనం, వసుచరిత్ర విమర్శ, వైయాకరణ పారిజాతం ముఖ్యమైనవన్నారు. కార్యక్రమంలో విశ్వసాహితి సంస్థ అధినేత డాక్టర్‌ జయరాములు, సీనియర్‌ పాత్రికేయురాలు దేవసేన, చైతన్య కళాసమితి అధినేత భవనాశి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.