‘‘మమ్ము కన్నతల్లి ఓ తెనుగు రాణి మమ్మేలుకోవమ్మ నిత్యకళ్యాణి ఆనంద మయిగా, అనురాగ జలనిధిగా అశాంతములదాకా పేరుమోసిన తల్లి..’’ ఈ ప్రార్థన చేస్తున్నది పదహారణాల అచ్చమైన తెలుగు కథకుడు మధు రాంతకం రాజారాం. ఈ మారుమూల పల్లెటూరి పెద్దాయన అతినిరాడంబరుడు. జీవితపు లోతుల్లోంచి వచ్చిన ఆయన కథలు అలాగే వుంటాయి. మధ్యతరగతి, యింకా కింది తరగతుల జీవన సంఘర్షణలే ఆయన కథావస్తువులు. వెనక బడిన రాయలసీమ ప్రాంతంలోని అనేకానేక సమస్యల్ని వైవిధ్యంగా చిత్రించి తెలుగు కథలో గొప్ప స్థానం కల్పించిన మహాకథాశిల్పి రాజారాం. 

 
గురజాడ ‘దిద్దుబాటు’ రాయలసీమకు 40 సంవత్సరాలు ఆలస్యంగా వచ్చిన ప్పటికి ఆ బాటను వెలుగుబాటగా మార్చుకొని సీమ కథా వారసత్వానికి వెలిగిం చిన దీపంగా మిగిలాడు రాజారాం. తెలుగుకథ తెలుగుకథ లాగే వుండాలని, తెలుగు జనజీవితాన్ని చిత్రించేలా వుండాలని గట్టిగా నమ్మి ఆచరణలో నిరూపించాడు. ఇతిహాసపు చీకటి కోణాలలోకి కథావెలుగుల్ని ప్రసరింపజేసిన గురజాడ, చింతా దీక్షితులు, పూడిపెద్ద వెంకటరమణయ్య, వేలూరి శివరామ శాస్త్రి, రాయసం వెంకటశివుడు, చాసో, శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి, చలం, బుచ్చి బాబు, కరుణ కుమార, చెరుకుపల్లి జమదగ్నిశర్మ, రావిశాస్త్రి, మల్లాది, కొడవటి గంటి కుటుంబరావుల సరసన నిలిచే రాజారాం తెలుగు కథను తెలుగుదనంతో నింపాడు. బాల్యం అంతా పల్లెల్లో గడిపి, వృత్తంతా పల్లెల్లోనే సాగించిన వ్యక్తి కావడం వల్ల ఆయన కథల్లో గ్రామీణత ఎక్కువగా కనిపిస్తుంటుంది. 
 
‘హాలికులు కుశలమా’ అనే కథలో పొలాలను, తోటలను తెలుగు కావ్యాలుగా, ప్రబంధాలుగా, శతకాలుగా రచయిత చెప్పిన తీరు అద్వితీయంగా ఉంటుంది. కావ్యాల్లో ప్రౌఢకావ్యం ఎలాంటిదో చెట్లలో పనసచెట్టు అలాంటిది- అందుకే దీని పేరు ‘ఆముక్తమాల్యద’ అంటాడు ఆ కథా నాయకుడు, వ్యవసాయంలోకి మళ్లిన మాజీబడిపంతులు రాయదుర్గం నరసప్పగారు. ఆయన దృష్టిలో- మొదలేదో చివరేదో తెలియకుండా అల్లిబిల్లిగా ఓ పొదరిల్లులా అల్లుకున్న ముంతమామిడి చెట్టు ‘కళాపూర్ణోదయం’, నిమ్మచెట్ల సమూహమే ‘మనుచరిత్ర’, బొప్పాయి చెట్లే ‘పారిజాతాపహరణం’, మల్లెపందిరి ‘దాశరథి శతకం’, నంది వర్ధనాలు ‘శ్రీకాళహస్తిశ్వర శతకం’, గన్నేరు పూలు నరసింహుడి మిడిగ్రుడ్లలా భయం కరంగా ఉంటాయి గనుక గన్నేరు చెట్ల పేరు ‘నరసింహ శతకం’, కంచెకల్లుకున్న కాకరపాదు ‘వేణుగోపాల శతకం’, ఎందుకంటే ‘‘పెట్టనేరని రండ పెక్కు నీతుల పెద్ద - మధ్వ వైష్ణవునికి నామాలు పెద్ద’’ అంటూ పరుషంగానైనా ఒంటికి నప్పే నిజాలు చెప్పే శతకమది, ఇక సదుప దేశాల్లో భర్తృహరి సుభాషితాలకున్న స్థానం ఎలాంటిదో, పదార్థంలో చిక్కుడు కాయలకు అలాంటి స్థానం. ద్విపదల దగ్గర్నుంచి ప్రారంభించి గేయ వాఙ్మయం అంతా చెరుకుతోటే, ఎవరి ఆకలికి తగ్గట్టుగా వారు సేవిస్తున్న కథలు నవలలు వరిపంట కిందజమ కట్టుకోకూడదా?.... ఇలా ఆయన చెప్పుకుంటూ పోతుంటే పురాణాలూ కావ్యాలన్నీ ఆయన తోటలో మొక్కలై కనిపిస్తాయి.
 
‘‘నిజమైన కళ ప్రచారం చేయదు. జీవితాన్ని చిత్రిస్తుంది ఆ చిత్రణ ద్వారా ఒక రసానుభూతిని కలిగిస్తుంది. ఒక జీవిత సత్యాన్ని పాఠకుడిలో ఉద్దీపింప జేస్తుంది,’’ అని చెప్పిన బుచ్చిబాబు అభిప్రాయం రాజారాం కథల్లో కనిపి స్తుంది. సోమర్‌సెట్‌మామ్‌, బుచ్చిబాబుల్లానే తన అనుభవపరిధిలోకి వచ్చిన సమస్త విషయాలను మధురాంతకం సాహిత్య నిబద్ధం చేశారు. 
 
సామాన్య ప్రజలను అసామాన్యంగా చిత్రంచడంలో మధురాంతకం రాజా రామ్‌ ఎంత గడుసరో, మధ్య తరగతి కుటుంబాల్లోఉండే చిత్ర, విచిత్ర మన స్తత్వాలను వాటి మధ్యలో ఉండే గాంభీర్యాన్ని వైవిధ్యాన్ని కూడా అంతే సహ జంగా చిత్రీకరించారు. తెలుగుదనపు కమ్మదనం రాజారాం కలంలో గుబాళి స్తుంది. ‘‘జీవితంలో గానివ్వు, కలంలో గానివ్వు వాస్తవం అంగిగా, కల్పన అంగంగా ఉండటం మంచిది’’ అని ‘చేదునిజం’ కథలో చెబుతారు. రాజారాం స్వతహాగా హాస్య ప్రియులు. ఎంతటి ప్రతికూల వాతావరణాన్నైనా తన సహజధోరణిలో స్వచ్ఛందంగా, ఆహ్లాదంగా మార్చుకుంటాడు. పల్లెపట్టులా మట్టికథలను చెప్పినా, కథనాల్లోని మధ్య తరగతి సమస్యలను ప్రస్తావించినా, ప్రయాణాల గురించో యాత్రల గురించో కథలూ కాకరకాయలు చెప్పినా తెలుగు పాఠకుడి గుండె గుడిలో ఆ దామల్‌ చెరువు అయ్యవారు పదిలమైన స్థానం సంపాదిం చారు. ‘ఎదురుగాలి’ దగ్గరి నుంచి ‘ఎడారి కోయిల’ దాకా ‘ఇక్కడ మేమంతా క్షామం’ మొదలు ‘మిస్‌ ఎమరాల్డ్‌ ఫ్రం ఫ్రాన్స్‌’ వరకు ఆయన తాత్విక ధోరణి ఏమిటో ఈ కథలు పట్టిస్తాయి. 400 పైగా కథలు రాసినరాజారాం ఎప్పుడూ తనను తాను అనుకరించుకోలేదు. 
 
‘ప్రొద్దుచాలని మనిషి’ కథలో ఆయన మృత్యువు గురించి ఇలా అంటారు: ‘‘జడత్యం మృత్యువు లక్షణం, చైతన్యం జీవ లక్షణం. పొద్దు పోకపోవడం మృత్యు లక్షణం. పొద్దుచాలక పోవడం జీవలక్షణం’’ కథక చక్రవర్తి డాక్టర్‌ మధురాం తకం రాజారాం నిజంగా పొద్దు చాలని మనిషి. 
********
 
(అక్టోబరు 5 మధురాంతకం జయంతి) 
నూకా రాంప్రసాద్‌ రెడ్డి