‘‘...ఆ అతాట్టితో ఆడు ఏటి జేస్తాడు? పన్నులేస్తాడు, పరిపాలిస్తాడు. అయితే, పెజల్ని పరిపాలిచ్చడానికి ఇన్ని పన్నులక్కర్లేదు. కానీ ఆడు అక్కర్లేని పన్నులొసూల్జేసి ఆడు బాగుపడి ఆడి సపోటర్సుని బాగు చేస్తాడు. ఆడి సపోటర్సూ అంటే ఆళ్ళెవరళ? ఆళ్ళంతా కూడా ఆళ్ళ జెబ్బల బలమ్మీదే ఆ రాజుని నిలబెట్టినోళ్ళన మాట. మనం మన దొంగ రాబడి ఓటా ఏసుకున్నట్టే ఆళ్ళు కూడా ఓటాలేసిస్సుకుంటారన్న మాట...’’ దొంగనోట్లు చలామణి చేసే నారాయుడు బంగారిగాడికి చెప్పిన మాటలివి, సూర్రావెడ్డు సాచ్చిగా.

 సాహిత్యం నుంచి సమాజం ఆశించేదేమిటి? సమాజం నుంచి సాహిత్యం స్వీకరించేదేమిటి? -అనే ప్రశ్నల నడుమ జవాబులను వెతికి తీసుకుంటుంది రావిశాస్త్రి నవల. తెలుగు నవలలో వాస్తవికత (రియలిజం) ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. నవలను రచించే వారంతా ‘సమాజం’ నుంచి నవలకు ఏం కావాలో స్పష్టంగా నిర్వచించుకొన్న తరువాత వేదిక మీదకు వస్తారు. ఋగ్వేదంలోని ఊర్వశీపురూరవుల దగ్గర నుంచి ఐతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపోఖ్యానము వరకు వచ్చిన కథలలో ఆధునిక నవల ప్రారంభమయిందనే సిద్ధాంతం వెనుక ఓ సామాజిక చైతన్య సూత్రానికి నాంది కాదనలేం. క్రమానుగతిలో  ఊహలకు, కల్పనకు తిలోదకాలిచ్చి ‘వాస్తవిత’ను చిత్రించింది తెలుగు నవల. 

 
ఆంగ్ల సాహిత్యంలో మొదటి నవలా రచయిత ‘డేనియల్‌ డెఫో’ (1659) నుంచి మన ‘రాజశేఖర చరిత్రము’ వరకు, ఆ తరువాత జరిగిన నవలా ప్రయాణంలో ‘వాస్తవికత’ మహాత్తరమైన పాత్రను పోషించింది. ‘‘కార్యాకారణ సంబంధం కలిగిన జీవితం ‘వాస్తవిక జీవితం’’’ అంటారు వల్లంపాటివారు. అందవికారమైన, అసహ్యకరమైన, జుగుప్సాకరమైన విషయాలు వాస్తవికతావాదానికి అస్పృశ్యాలు కావు. ఇక్కడ మరో గమనించదగ్గ అంశమేమిటంటే, వాస్తవిక నవల జీవితం ఎలా ఉంది అన్నది మాత్రమేకాక, అలా ఎందుకుందో కూడా చెబుతుంది. కంటికి కనిపించిన ప్రతి చిన్న విషయాన్ని ఎలాంటి వక్రీకరణలు లేకుండా రికార్డు చేసినప్పుడే ‘పరిశుద్ధమైన చరిత్ర’ అవుతుంది. సమాజంలోని ఆ కోణం కూడా సచిత్రంగా దృశ్యమానమవుతుంది. ఈ కోవకు చెందినదే రాచకొండ విశ్వనాథశాస్త్రి ‘మూడు కథల బంగారం’. పైన ఉదహరించిన సంభాషణ ఒక్కటి చాలు రావిశాస్త్రి గారు ఈ రచన చేయటం వెనుక గల కారణం అర్థం కావటానికి. ఇందులో ప్రధానమైన కథలు: ‘వియత్నం విమల వృత్తాంతం’, ‘బంగారిగాడికత’, ‘బంగారు బాబు కథ’, ‘బంగారయ్యి గారి కథ’. ఈ పేర్ల వలన కూడా నవలా ఇతివృత్తం అర్థమవుతుంది. కాని... రావిశాస్త్రి కథను నడిపించడంలో భాష, యాసలను ‘కవిత్వీకరించటం’ కనిపిస్తుంది. ఆయన రచనాశైలిలోనే ఒక విధమైన (వ్యంగ్యాత్మక) ధ్వని, ఆలోచింపజేసే కవిత్వపు అలవరస ఉన్నాయి.
 
నవలకు ముందు మాటలో రచయిత ‘‘నేను సృష్టించాలనుకున్న కొన్ని పాత్రలు అవి సృష్టించబడ్డాక అవి నా వశం తప్పి పారిపోగా వాటిని నిలబెట్టి ఆపడంలో ఆలస్యం’’ అయిందంటారు. ఈ మాటలు పాత్రలలో పరకాయ ప్రవేశం చేసిన రచయిత అంతరంగాన్ని ఆవిష్కరిస్తాయి. సహజత్వం కోసం కొన్ని పాత్రలకు ‘ఇంటి పేర్లు’ కూడా ఉన్నాయి. ‘‘మన తెలుగు వాళ్ళకి ఇంటి పేర్లు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని పాత్రలకు ఇంటి పేర్లు పెట్టాను. కాని, అటువంటి పేర్లు గల వ్యక్తులు నిజంగా ఉన్న నాకు తెలీదు’’ అని కూడా చెప్పుకున్నారు రచయిత.
 
‘మూడు కథల బంగారం’ నవలలో ‘అవినీతి’కి ఉన్న అక్టోపస్‌ టెంటికల్స్‌ రూపాలను దర్శింపజేస్తారు రావిశాస్త్రి. ఆయన ‘నేనెందుకు రాస్తాను’ అనే వ్యాసంలో ‘‘లోకం డబ్బున్న వాళ్ళు డబ్బులేనివాళ్ళు వుంటారనీ, వాళ్ళకీ వీళ్ళకీ మధ్య చాలా తేడాలుంటాయని నాకు తొమ్మిది లేక పదోయేట నుంచి బాగా తెలుసు. డబ్బులో వుండే సౌఖ్యాలు, లేమిలో వుండే దుఃఖాలు, ధనం కవ్వించే గొప్ప గర్వ మదాంధత, లేమి కవ్వించే నిస్పృహ, నైచ్యం, దైన్యం అవన్నీ కూడా నా జీవితంలో నేను బాగా తెలుసుకొన్నాను... నా మనసుని ఆ బాధ, ఆ ఆవేదన పట్టుకు వదలటం లేదు. మరింక వదలదు’’ అని వివరిస్తారు. మూడు కథల బంగారం రచనలో ఇదంతా కనిపిస్తుందని, విమల, విమల తండ్రి, బంగారిగాడి చెల్లెలు, బంగారయ్యి, సుర్రావ్‌ హెడ్డు, అమ్మలు, సత్రకాయిలు ఇలా... ఎన్నెన్నో పాత్రల్లో ఈ మొత్తం కథనం వినిపిస్తుందని నేననుకుంటాను. 
 
రాచకొండ విశ్వనాథశాస్త్రి గారు ‘మూడు కథల బంగారం’ రచనలో ప్రతీ పాత్రను పరిచయం చేసే క్రమంలో చక్కని వర్ణనలకు చోటు కల్పిస్తారు. విమల కుటుంబం గురించి ‘‘బంతిపువ్వు లాంటి మా అమ్మ మనసులో భగ్గు భగ్గున మంటలెందుకు? పాపాల కట్నాల వాళ్ళకే అవినీతి బంగారపు బిందెలెందుకు? మా అన్నల గుండెలకి బదులు నిండా అంతలేసి రాతి బండలెందుకు? మా వదినెల కళ్ళలో ఆ నాగుపాము పడగలెందుకు...’’ అని రాస్తారు. చిలకదాసు గురించి ‘‘అతను తెలుగు సినిమాల మీద పెరిగాడు’’ అంటారు. వియత్నం విమలను గురించి వజ్రాలధనం, బంగారయ్య, వైట్‌హార్స్‌ (డాక్టర్‌) బైరాగినాయుడు, రామచంద్రయ్య తదితరులతో అనేకరకాలుగా చెప్పిస్తారు. వాటిలోనే ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తారు. ఇది రచనా విధానం.
 
ఆయన సంభాషణ చాతుర్యం. వాటిలో కనిపించే కవిత్వ ఛాయలు అబ్బురమనిపిస్తాయి. ‘‘నవలను వర్ణనాత్మక సూత్రాలతో మాత్రమే విశ్లేషించవలసిఉంటుంది’’ అని వల్లంపాటి వారి అభిప్రాయం. రావిశాస్త్రి ఈ నవలలో పాత్రలకు వాడిన భాష కూడా వాస్తవికంగా కనిపిస్తుంది. నవల వివరించే జీవితంలో భాష కూడా ఒక భాగం. 
 
బ్యూరోక్రసీలో వివిధ రంగులు కనిపిస్తాయి. నాయకులు, అధికార్లు ఇలా పరస్పరాశ్రిత వర్గాలు ప్రజలను దోచుకుంటున్న వేళ, ప్రజలు మాత్రమే త్యాగాలు చేయాలని నిర్ణయించే సమయంలో, వీరిని ఎలా మార్చటం అనేది ఓ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం రావిశాస్త్రి గారే బంగారయ్య చేత చెప్పించారు. ‘‘దేశాన్ని పాలించే శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులు, ఉపమంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కమీషనర్లు, సెక్రటరీలు, కలక్టర్లు, టీచర్లు... వీరందర్ని ఎన్నుకొనేముందో, నియమించుకొనే ముందో వీరందరిలో ప్రతీ ఒక్కరి చేత నిర్భందంగా ఏడాదిపాటు రోజుకూలీకి రాళ్ళు కొట్టించో, బొగ్గు తవ్వించో చేపలు పట్టించో, పడవలు నడిపించో... ఆరోజు కూలీ డబ్బులు మీదే ఆ ఏడాది బతకమని శాసించి అమలు జరిపితే ప్రస్తుతం దేశాల్లో ఉన్న చట్టాల పరిధిలోనే కొంత మంచి పరిపాలన జరగవచ్చునని తెలుసుకున్నాను. అది నిజమని నేను నమ్ముతాను’’- ఇదీ బంగారయ్యి జైల్లో తెలుసుకొన్న నిజం.
ప్రతి రచయితా కూడా తను ఎవరి మంచి కోసం రాయాలో నిర్ణయించుకోవాలంటారు రావిశాస్త్రి: ‘‘ప్రతీ రచయితా కూడా తను ఎవరి మంచికోసం రాయాలో ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయించుకుంటారని నేను అనుకుంటాను. రచయిత ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తుందో ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకి సహాయమూ చెయ్యికూడదని నేను భావిస్తాను.’’ అంటారు మూడు కథల బంగారం, అటువంటి బంగారం లాంటి రచనే!
 
********

భమిడిపాటి గౌరీశంకర్‌

94928 58395