చిక్కడపల్లి,ఏప్రిల్‌19(ఆంధ్రజ్యోతి): ఆధునికయుగంలో ప్రబంధం రాసి ప్రసిద్ధి పొందినవారు ఉత్పల సత్యనారాయణాచార్య అని ప్రముఖ కవి, విమర్శకులు రమణ వెలమకన్ని అన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో గానసభలో శుక్రవారం రాత్రి ప్రముఖ సాహితీవేత్త ఉత్పల సత్యనారాయణాచార్య జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా రమణ వెలమకన్ని మాట్లాడుతూ ఉత్పల ఆధ్యాత్మికరచనల్లో అగ్రగణ్యుడని అన్నారు. పద్యరచన అంతరించి పోతున్న తరుణంలో పాఠకులను తిరిగి పద్యంవైపు మళ్లించిన మహాకవి అన్నారు. స్వతహాగా శ్రీకృష్ణ భక్తుడని తెలిపారు. శ్రీకృష్ణతత్వాన్ని వివరిస్తూ అనేక అపురూప గ్రంథాలను రచించారన్నారు. ఆయన రచించిన సుమారు 50 కావ్యాల్లో గజేంద్రమోక్షం, గోపీగీతం, రాజమాత,  యశోదానంద, రసధ్వని ప్రసిద్ధమైనవని అన్నారు. ఆధునిక వస్తువును పద్యరూపంలో అద్భుతంగా చెప్పగల ప్రతిభావంతుడు ఆయన అని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ హంస పురస్కారం ఆయనకు దక్కిన గౌరవాలు అని తెలిపారు. ఈ సమావేశంలో కవి జెల్ది విద్యాధరరావు, గాయకుడు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.