బెంగుళూరు, మే 3(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కన్నడ సాహితీవేత్త, నిత్యోత్సవ కవిగా పేరొందిన నిసార్ అహ్మద్ (84) బెంగళూరులోని నివాసంలో ఆదివారం కన్నుమూశారు. వయోభారంతోపాటు కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇటీవలే ఆసుపత్రిలో చేరారు. అధ్యాపకుడిగా వృత్తిని ఆరంభించిన నిసార్ 1978లో తొలి పాటల క్యాసెట్ ‘నిత్యోత్సవ’ పేరిట విడుదలైంది. అప్పటి నుంచి నిత్యోత్సవ కవిగానే రాణిస్తున్నారు. సాహిత్యం ద్వారా జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. పదేళ్ల ప్రాయంలోనే ‘జలపాతం’పై కవిత రాశారు. అప్పటి నుంచి ఆయన సాహితీ ప్రస్థానం ఆరంభమైంది. 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. కర్ణాటక సాహిత్య, అకాడమీ, కెంపేగౌడ పురస్కారం, రాజ్యోత్సవ పురస్కారం, అరసు వంటి పురస్కారాలు పొందారు. పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన నిసార్ అహ్మద్ 73వ కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడిగా వ్యవహరించారు. నిసార్ మృతికి యడియూరప్ప, మాజీ ప్రధాని దేవేగౌడ సహా పలువురు సంతాపం తెలిపారు.