గుండెపోటుతో అర్ధరాత్రి తుదిశ్వాస

మారేడుపల్లి/ఏలూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నవలా రచయిత్రి డాక్టర్‌ సి.ఆనందారామం (86) గుండెపోటుతో కన్నుమూశారు. మారేడుపల్లి బలరామ్‌ బ్లాక్స్‌ కాలనీలో నివసిస్తున్న ఆమెకు బుధవారం అర్ధరాత్రి గుండె నొప్పి రావడంతో సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆనందారామం స్వస్థలం ఏపీలోని ఏలూరు. ఆమె అసలు పేరు ఆనందలక్ష్మి. భర్త పేరు రామాచారి. అందుకే.. భర్తపేరుతో కలిపి ఆమె ఆనందారామంగా మారారు. ఆమె అత్తవారి ఊరు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం. 1935లో జన్మించిన ఆనందారామం.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. అనంతరం డాక్టర్‌ సీ నారాయణరెడ్డి గైడ్‌గా పీహెచ్‌డీ పూర్తిచేసి డాక్టరేట్‌ పట్టా పొందారు. ఆ తర్వాత సుమారు 30మంది విద్యార్థులు ఆమె ఆధ్వర్యంలో పీహెచ్‌డీ చేశారు.

2000లో పదవీ విరమణ పొందారు. ఆనందారామం 1954 నుంచే కథలు, నవలలు రాయడం ప్రారంభించారు. ఇంద్రసింహాసనం, సంపెంగ పొదలు, మమతల కోవెల, నేటి కథ, ఇదా భారతం, ప్రేమస్తోత్రం సహా 60 కథలు, నవలలు రాశారు.ఆమె రాసిన నవలల ఆధారంగా త్రిశూలం, జీవిత, జ్యోతి, ప్రేమదీపాలు, సంసారం వంటి సినిమాలు నిర్మించారు. గృహలక్ష్మి, సాహిత్య, కవిత్రయ బహుమతి వంటి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. కౌలాలంపూర్‌, న్యూయా ర్క్‌, లండన్‌, తెలుగు సంఘాల నుంచి ఎన్నో సన్మానాలు దక్కించుకున్నారు. ఆమె మృతి పట్ల అనేక మంది కవులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, అల్వాల్‌లోని శ్మశాన వాటికలో గురువారం ఆమె దహన సంస్కారాలు జరిగాయి. బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్‌గా, జీఎమ్‌గా పనిచేసిన ఆమె భర్త.. మూడేళ్ల క్రితమే మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.