అన్యాయాన్ని ఎదిరించినోడు ఆయనకు ఆరాధ్యుడు

వరంగల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 8: జీవిత పర్యంతం ప్రజల కోసమే తపించిన మహామనీషి కాళోజి నారాయణరావు. తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని భావితరాలకు పోరాట స్ఫూర్తిని నింపారు. అవనిపై జరిగేటి అవకతకవలు చూసి ఎందుకో నాహృదిని ఇన్ని వేదనలు. పరుల కష్టము చూచి కరిగిపోవును గుండె. మాయమోసము చూచి ఒళ్ళు మండిపోవును అంటూ కలతపడ్డారు. కాళోజి 106వ జయంతి నేడు (సెప్టెంబరు 9).1914 సెప్టెంబర్‌ 9న కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా రిట్టిహళ్ళి గ్రామంలో జన్మించిన నారాయణరావు తల్లి రమాబాయి, తండ్రి రంగారావు. వరంగల్‌ సమీపంలోని మడికొండలో స్థిరపడ్డారు. కాళోజీ పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చి నిజాం కొలువులో స్థిరపడ్డారు.తాత తండ్రులది మహారాష్ట్ర, మాతామహులది కర్నాటక. దీంతో కాళోజీకి మూడు భాషలు సహజంగానే అబ్బినాయి.

ఉర్దూ, అరబ్బీ, పార్శీ, సంస్కృతం, ఆంగ్లం నేర్చుకున్నారు. కాళోజీ పూర్తి పేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరావు రాజారాం కాళోజీ. ప్రాథమిక విద్య మడికొండలో సాగింది. తర్వాత వరంగల్‌, మెదక్‌, హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి వకీలు పట్టా పొందారు.కొంతకాలం హైదరాబాద్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఆ తర్వాత దానిని వదిలేసి పూర్తిగా ప్రజా సంక్షేమ ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేశారు. ప్రముఖ కవి, గవిచర్ల గ్రామనివాసి వేలూరి మాణిక్యరావు కుమార్తె రుక్మిణిని 1940లో వివాహం చేసుకున్నారు.కాళోజీ రాజకీయ సాంస్కతిక ఉద్యమకారుడిగా, కవిగా ప్రసిద్ధి పొందాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నాడు. స్వాతంత్రోద్యమం, ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, గణేశ నవరాత్రి ఉత్సవాల్లో, జెండావందన కార్యక్రమాలు, సత్యాగ్రహాల్లో పాల్గొని బలీయమైన పాత్ర పోషించారు.నిజాం ప్రభుత్వం కాళోజీకి నగర బహిష్కరణ విధించింది. పలుసార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఉపాధ్యాయుల పక్షాన ఎమ్మెల్సీగా కొంత కాలం పని చేశారు.వివిధ రంగాల్లో కాళోజీ చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ ప్రదానం చేసింది. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. రాజ్యలక్ష్మీ ఫౌండేషన్‌, రామినేని ఫౌండేషన్‌ (యుఎ్‌సఎ) వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సత్కరించాయి. మరణానంతరం కూడా తన భౌతిక కాయాన్ని కాకతీయ వైద్య కళాశాలకు దానం చేశారు.