అంతర్జాతీయ సదస్సులో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రక్రియ ‘శతకం’ అని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడు దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. మధురకవి మల్లవరపు రాజేశ్వరరావు వర్ధంతి సందర్భంగా బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, జానుడి, మల్లవరపు జాన్‌ మధుర సాహిత్య భారతి సంయుక్తంగా శుక్రవారం ఆన్‌లైన్‌లో ‘‘వెయ్యేళ్ల తెలుగు శతక సాహిత్యం-సమాలోచన’’ అనే అంశంపై రెండు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వేమన శతకాలపై సునిశితమైన పరిశోధన అవసరమని పేర్కొన్నారు. శతకం సార్వజనీనం కాదన్న ఆయన.. కొన్ని ప్రాచీన శతకాలలో కుల, మత దూషణలుండటాన్ని ఉదహరించారు. అలాంటి శతకాలకు పునర్మూల్యాంకనం అవసరమని సూచించారు. ప్రముఖ కవి మల్లవరపు ప్రభాకరరావు మాట్లాడుతూ.. శతకాన్ని ప్రజాస్వామిక లక్షణంగల సాహిత్య ప్రక్రియగా పేర్కొన్నారు. మారిష్‌సలో తెలుగు భాషాధికారి సంజీవ మాట్లాడుతూ తమ దేశంలో తెలుగు శతకానికున్న ఆదరణ గురించి వివరించారు. తెలుగు శతక సాహిత్యంపై తొలిసారి అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమని కాశీ హిందూ వర్సిటీ తెలుగు ఆచార్యుడు చల్లా శ్రీరామచంద్రమూర్తి అన్నారు.