ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌ సిటీ:ఎన్‌టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న 30వ జాతీయ పుస్తక మహోత్సవ ప్రాంగణమంతా మంగళవారం పాఠశాల విద్యార్థులు, చిన్నారుల తో కోలాహలంగా మారింది. పిల్లల్లో పఠనాశక్తిని పెంచడంకోసం పాఠశాల యాజ మాన్యమే తమ విద్యార్థులందరినీ బుక్‌ ఫెయిర్‌ విజిట్‌కి తీసుకొస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి సైతం పాఠశాల విద్యార్థులు బుక్‌ఫెయిర్‌ సందర్శనకు తీసుకురావడం విశేషం. ఇంతకీ పిల్లలు ఎలాంటి పుస్తకాలు ష్టపడుతున్నారు! పుస్తక పఠనంపై బాలల అభిప్రాయం వంటి విశేషాల కధనం 

బుక్‌ ఫెయిర్‌ మంగళవారం పాఠశాల విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. నిన్న మొత్తం 35వేల మంది పుస్తక ప్రదర్శనని సందర్శిస్తే, వారిలో 8వేలమంది విద్యార్థులు, చిన్నారులే ఉండటం ఆశ్చర్యకరం. తల్లిదండ్రులు స్వయంగా పిల్లల్ని బుక్‌ ఫెయిర్‌కి తీసుకొచ్చి, ఇష్టమైన పుస్తకాలు తీసుకోమని ప్రోత్సహించడం కనిపిస్తున్న మార్పు. మరోవైపు పాఠశాల యాజమాన్యమే స్వయంగా తమ విద్యార్థుల్ని విజ్ఞానయాత్రలా పుస్తక ప్రదర్శనకి తీసుకురావడం మంచి పరిణామం. స్లేట్‌ స్కూల్‌ అబిడ్స్‌, మహాబోధి విద్యాలయ, అల్వాల్‌, ఎస్‌పీఆర్‌ స్కూల్‌, ఘట్‌కేసర్‌ వంటి నగరం చుట్టుపక్క ప్రాంతాలకి చెందిన పాఠశాలలతోపాటు, కల్వకుర్తి నుంచి అరబిందో పాఠశాల విద్యార్థులు పుస్తక ప్రదర్శనని సందర్శించారు. సహవిద్యార్థులతో కలిసి ఒకరిభుజంపై ఒకరు చేతులేసుకొని, కేరింతలు కొడుతూ, స్టాళ్లన్నీ కలియతిరగడం పుస్తక ప్రదర్శనకి కొత్త శోభని తెచ్చింది. తాము చదవాలనుకుంటున్న, కొనాలనుకుంటున్న పుస్తకాల గురించి ఒకరికొకరు చర్చించుకుంటూ, వారెరిగిన పుస్తకాల రచయితల పేర్లను ఉటంకిస్తూ, వారి రచనల గురించి విద్యార్థులు మాట్లాడుకోవడం పెద్దల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 

పిల్లలు మెచ్చిన పుస్తకాలు 
సహజంగా పిల్లలంటే నీతికథలు, పేదరాసి పెద్దమ్మ, అనగనగా రాజు, చోటాభీం, సూపర్‌మ్యాన్‌ వంటి కాల్పనిక సాహిత్యాన్ని ఎక్కువ ఇష్టపడతారనేది చాలా మంది అభిప్రాయం. కానీ పుస్తక ప్రదర్శనలో విద్యార్థులు కొందరు జానపద కథలు, మరికొందరు శ్రీశ్రీ, అడవిబాపిరాజు రచనలతోపాటు, చరిత్రకి సంబంధించిన పుస్తకాలను, ఖగోళానికి సంబంధించిన రచనలను ఎక్కువ మంది కొనడం పుస్తక ప్రదర్శనలో కనిపించిన దృశ్యం. మరికొంతమంది చిన్నారులు తమకి కవిత్వం ఇష్టమని చెప్పడం విశేషం. ‘‘సాహిత్యం పట్ల పిల్లలు చూపిస్తున్న ఆసక్తి చూస్తుంటే, నూతన భవిష్యత్తుకి పునాదులు పడుతున్నంత ఆశ అంకురిస్తుందని’’ బుక్‌ఫెయిర్‌ వ్యవస్థాపక కార్యదర్శి రాజేశ్వరరావు తెలిపారు. 

నాకు సైన్స్‌కి సంబంధించిన పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవడం అన్నా ఆసక్తి. వివేకానంద జీవిత చరిత్ర చదివాను. ఇప్పుడు అన్నాహజారే పుస్తకం, వింగ్స్‌ ఆఫ్‌ సైలెన్స్‌, క్యాట్‌ అండ్‌ మౌస్‌ పుస్తకాలు తీసుకున్నాను. 
-రవితేజ, 9వ తరగతి 


చరిత్ర పుస్తకాల్ని ఎక్కువ ఇష్టపడతాను. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత చరిత్ర, సాహిత్యం గురించి తెలుసు కోవాలని కోరిక. అడవిబాపిరాజు గోనగన్నా రెడ్డి నవల గురించి ఆరు నెలల క్రితం మా టీచర్‌ చెప్పారు. ఇప్పుడు ఆ పుస్తకం కొన్నా ను. మా స్కూల్‌ టైంటేబుల్‌లో రోజుకొక గంట బుక్‌ రీడింగ్‌ హవర్‌ ఉంటుంది. 
-పవన్‌, 8వ తరగతి 


నాకు కవిత్వం చాలా ఇష్టం. శ్రీ.శ్రీ, కాళోజీ, దాశరథి కవిత్వాన్ని ఇష్టపడతాను. అప్పుడప్పుడు దినపత్రికల్లో వచ్చే కవితల్ని కూడా చదువుతుంటాను. మా తెలుగు టీచర్‌ లలిత గారు మమ్మల్ని ప్రోత్సహిస్తారు. రోజులో ఎప్పుడోఅప్పుడు అనవసరంగా టైం వృద్ధా అవుతుంటుంది. 
-తిరుమల, 10వ తరగతి, అల్వాల్‌ 

నాకు సైన్స్‌ రంగంలోని గొప్పవ్యక్తుల గురించి తెలుసుకోవాలని ఆసక్తి. ఖగోళశాస్త్రం గురించిన పుస్తకా లు చదవుతాను. స్టీఫెన్‌ హాకింగ్‌ రచనలం టే చాలా ఇష్టం. ఫిజిక్స్‌కి సంబంధిం చిన పుస్తకం తీసుకున్నాను. వీటితోపా టు తెనాలి రామకృష్ణ వంటి ఫోక్‌టేల్స్‌ చదవుతాను. 
-నితీష్‌, 10వ తరగతి