ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌ సిటీ:డిజిటల్‌, ఈ బుక్స్‌ వెల్లువెత్తుతున్న తరుణంలో పుస్తకానికి ఏమాత్రం ఆదరణ తగ్గలేదనడానికి పుస్తక ప్రదర్శనకు వస్తున్న స్పందనే నిదర్శనం. ఈ సందర్భంలో పుస్తకాల కొనుగోలు ఎలా ఉందో బుక్‌స్టాళ్ల నిర్వాహకులు, ప్రచురణకర్తల మాటల్లో...! 

నవంబర్‌8 తర్వాత జరిగిన రాజమండ్రి పుస్తకప్రదర్శన ప్రచరుణకర్తలకు పెద్ద లోటును మిగిల్చింది. 50లక్షల అమ్మకాలు జరగాల్సింది 15లక్షలతో సరిపెట్టుకుంది. దాంతో అక్కడి బుక్‌ ఫెయిర్‌ నిర్వాహకులు శ్రీకాకుళం, వైజాగ్‌ ప్రదర్శనలను రద్దుచేశారు. నోట్ల రద్దు ప్రభావంతో జైపూర్‌, బెంగళూరు, పూనె పుస్తకప్రదర్శనలు సైతం వెనకడుగువేశాయి. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ నిర్వాహకులు మాత్రం వెనకడుగువేయలేదు. నిత్యవసరాలు కొనడానికే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్న పరిస్థితుల్లో పుస్తకాలు కొంటారా? అనే అనుమానాలు వారిని వెంబడించాయి. అలాంటి పరిస్థితుల్లో సాహసోపేతమైన అడుగు ముందుకేశారు నిర్వాహకులు. 30వ హైదరాబాద్‌ జాతీయ పుస్తకోత్సవాన్ని ప్రారంభించారు. 12రోజుల పాటు జరుగుతున్న ఈ ప్రదర్శనకి ప్రతిరోజూ సందర్శకులు వెల్లువెత్తుతున్నారు. శని, ఆదివారాలైతే ప్రాంగణమంతా పుస్తకప్రియులతో నిండిపోయింది. పనిదినాల్లో సైతం సాయంత్రాలు పుస్తక ప్రియులు క్యూలు కడుతున్నారు. సోమవారం 45వేల మంది పుస్తక ప్రదర్శనను సందర్శించారని కార్యదర్శి చంద్రమోహన్‌ తెలిపారు. పాయింట్‌ సేల్స్‌ మిషీన్లు, పేటీఎం, నెఫ్ట్‌బ్యాంకింగ్‌ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో అమ్మకాలు సైతం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏ మాత్రం తగ్గలేదని కొందరు స్టాళ్ల నిర్వాహకులు అన్నారు. డిజిటల్‌ చెల్లింపుల సౌకర్యం లేనిస్టాళ్లలో మాత్రం 20నుంచి30శాతం అమ్మకాలు తగ్గాయని తెలిపారు. 


కొన్ని ప్రత్యేక స్టాళ్లు..! 
చలం సాహిత్యం - స్టాల్‌నెంబర్‌ 65 
విశ్వనాథ సత్యనారాయణ సమగ్ర సాహిత్యం - స్టాల్‌ నెంబర్‌ 20 
ఓషో రచనలు - స్టాల్‌నెంబర్‌ 91 
పూలే-అంబేద్కర్‌ - స్టాల్‌నెంబర్‌ 90 
ఇస్లామిక్‌ సాహిత్యం (తెలుగు) - స్టాల్‌ నెంబర్‌ 267 
లెఫ్ట్‌ వరల్డ్‌ (వామపక్ష భావజాల సాహిత్యం) - స్టాల్‌నెంబర్‌ 252 
ఈషా షాపింగ్‌ జగ్గీవాసుదేవ్‌ ప్రవచనాలు - స్టాల్‌నెంబర్‌ 187 
రాయలసీమ సాహితీ సౌరభాలు - స్టాల్‌నెంబర్‌ 122 
జిడ్డు కృష్ణమూర్తి సమగ్ర సాహిత్యం - స్టాల్‌ నెంబర్‌ 04 
కేంబ్రిడ్జి యూనివర్సిటీ - స్టాల్‌నెంబర్‌ 02 
అరుణతార విప్లవ సాహిత్యం - స్టాల్‌ నెంబర్‌ 242 
లిఖిత ప్రెస్‌ (సీ్త్రవాద, ముస్తింవాద సాహిత్యం) - స్టాల్‌ నెంబర్‌ 288 
హరిపబ్లికేషన్స్‌ (భగవద్గీత, భారత, రామాయణాలు) - స్టాల్‌నెంబర్‌ 03 
వ్యవసాయానికి సంబంధించిన పుస్తక సమాచారం రైతునేస్తం - స్టాల్‌నెంబర్‌ 123 
మన తెలుగు రచయితలు స్టాల్‌ (30శాతం రాయితీ) - స్టాల్‌నెంబర్‌ 109 
బుద్ధిజానికి సంబంధించిన సాహిత్యం, ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌ - స్టాల్‌నెంబర్‌ 39 
రోటిపచ్చళ్లపై ఉద్యమం, వాసిరెడ్డి పబ్లికేషన్స్‌ - స్టాల్‌నెంబర్‌ 137
 
నేటి కార్యక్రమాలు
మధ్యాహ్నం 2నుంచి 5గం.ల వరకు - పోయెట్రీ వర్క్‌షాప్‌ 
సాయంత్రం 4.15 కి తెలంగాణ వ్యాపాలు పుస్తకావిష్కరణ 

సాయంత్రం 5.45కి సాహిత్యంలో హైదరాబాద్‌ - పర్యావరణ స్పృహ అంశంపై సదస్సు. ముఖ్య అతిధి అల్లం నారాయణ, ఎం వేదకుమార్‌, జలజం సత్యనారాయణ. నిర్వాహణ ఆచార్య డా. ఎస్‌ రఘు. 

సాయంత్రం 6 - జమీల నిషత ఆధ్వర్యంలో మహిళ కవ్వాలి,

 

అరుదైన పుస్తకం ‘‘వరల్డ్‌ ఫోక్‌టైల్స్‌’’ 

ప్రపంచంలోని అన్నీ ఖండాల్లోని దేశాలు, ప్రాంతాల్లోని జానపద కథల సమాహారం ‘‘వరల్డ్‌ ఫోక్‌టైల్స్‌’’ సిరీస్‌. థామస్‌ ఏ గ్రీని అనే అమెరికన్‌ రచయిత 12ఏళ్ల పాటు పరిశోధనచేసి, అన్నీ ప్రాంతాల, సంస్కృతులలోని ప్రాచుర్యంలోఉన్న, ప్రజాదరణపొందుతున్న జానపద కథలన్నింటినీ సేకరించి నాలుగు వాల్యూమ్స్‌గా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. వరల్డ్‌ ఫోక్‌టైల్స్‌ నాలుగు వాల్యూములు మొత్తం ధర రూ12,000. ‘‘ఇలాంటి అరుదైన పుస్తకాల్ని మన పాఠకులకు అందించాలన్న ఉద్దేశంతో అమెరికా నుంచి ఈ పుస్తకాల్ని ప్రత్యేకంగా తెప్పించామని’’ అనల్ప బుక్‌ స్టాల్‌ నిర్వాహకుడు బలరాం తెలిపారు. మార్క్‌ట్వైన్‌, ఆస్కార్‌వైల్డ్‌, చార్లెస్‌డికెన్స్‌, వంటి ప్రముఖుల సమగ్ర రచనలతోపాటు, ప్రపంచ కవిత్వం, తత్వశాస్త్రం, సైన్స్‌, సినీరంగానికి సంబంధించిన అరుదైన పుస్తకాలు అనల్ప బుక్‌స్టాల్‌లో కొలువుదీరున్నాయి. అనల్ప బుక్‌స్టాల్‌ నెంబర్‌ - 206