హైదరాబాద్‌ సిటీ, ఆంధ్రజ్యోతి:  ‘‘మానవ మేధకు పదునుపెట్టే అద్భుత సాధనం పుస్తకం’’.. అంటారు ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం. ప్రభుత్వ అధికారిగానే కాదు, విద్యార్థి దశలోనూ హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనతో తనకు ప్రత్యేక అనుబంధముందని ఆయన చెబుతున్నారు. పుస్తక ప్రదర్శనను సందర్శించడానికి విచ్చేసిన పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశంతో ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూ.. 

  పుస్తకం అజరామరం

 దృశ్య, శ్రవణ మాధ్యమాల హవా ఎంత పెరిగినా పుస్తకం అజరామరం. డిజిటల్‌ యుగంలోనూ అక్షరం విలువ అమూల్యమైంది. వినడం, చూడటం, చదవడం.. ఈ మార్గాల ద్వారా మనిషికి జ్ఞానం అందుతుంది. ఎక్కడికైనా తీసుకెళ్లగల వెసులుబాటు పుస్తకానికి ఉంది. తక్కువ ఖర్చుకే దొరుకుతుంది. మన మెదడులో ఉన్న ప్రతి అణువు ఉత్తేజితం కావాలంటే పుస్తకంతో సంపర్కం తప్పనిసరి. 

జ్ఞాపకం...

 ఐఏఎస్‌ అధికారి హోదాలోనేకాదు... విద్యార్థిగా ఎన్నో సార్లు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ని సందర్శించాను. అప్పుడు నిజాం కాలేజీ గ్రౌండ్స్‌, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బుక్‌ ఫెయిర్‌ నిర్వహించేవారు. కొన్నిసార్లు పుస్తకాలు కొనడానికి డబ్బులుండేవి కాదు. అయినా సరే! పుస్తక ప్రదర్శన చూడటం కోసం.. పుస్తక స్టాళ్లు, అందులోని పుస్తకాల గురించి తెలుసుకోడం కోసమైనా బుక్‌ ఫెయిర్‌ని సందర్శించేవాడ్ని.   

అంబేద్కర్‌ మాటల స్ఫూర్తితో...

 నేను పుస్తకం తీర్చిదిద్దిన వ్యక్తిని. నా జీవితానికి పుస్తకం అనుసంధానమై ఉంది. నా చిన్నతనంలో పొట్లంగా మా ఇంటిలోకి వచ్చే ప్రతి చిత్తుకాగితం, పాత వార్తాపత్రికలు.. ఏవి కనిపించినా వాటిని అలా తిరగేసేవాడ్ని. తద్వారానే కరెంట్‌ ఎఫైర్స్‌తో పాటు సామాజిక విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. ‘‘సమాజం మొత్తం నన్ను దూరం చేసినా, పుస్తకం ఒక్కటే తల్లిలా అక్కునచేర్చుకుంది’’ అని అంబేద్కర్‌ అన్నారు. ఆ మాటలు నన్ను ప్రభావితం చేశాయి. పుస్తకం ప్రాధాన్యతను గుర్తించేలా చేశాయి.

పుస్తకం మార్చిన జీవితాలు...

 బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో ‘‘ముసాహెర్స్‌’’ తెగ ఉంది. వారంతా కడు పేదరికాన్ని అనుభవిస్తూ, దయనీయ పరిస్థితిలో బతుకీడుస్తుంటారు. తినడానికి తిండి లేక ఎలుకలను పట్టి చంపి తింటారు. అంతటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న ఆ జాతికి చెందిన ఒకరింట్లోకి ఓ పుస్తకం వస్తుంది. అది ఏ పుస్తకం, ఎలా వచ్చిందో, అందులో ఏముందో ఎవరికీ తెలీదు. కానీ ఆ పుస్తకాన్ని చూసిన ఆ కులపెద్ద ‘‘ఇక మన కుటుంబాలు బాగుపడతాయి. చీకటి చూరిన మన ఇళ్లలో ఇక నుంచి సూర్యుని వెలుగులు ప్రసరిస్తాయన్న ఆశ కలుగుతోంది’’ అన్నాడు. వాస్తవంగానే పుస్తకం ద్వారా వారి జీవితాలు అనూహ్యంగా మారాయి. పుస్తకం శక్తిమంతమైందనడానికి ఇంతకన్నా ఉదాహరణ మరేముంది. 

ఇష్టమైన పుస్తకాలు....
మహాత్మాగాంధీ ఆత్మకథ ‘మై ఎక్స్‌పర్‌మెంట్స్‌ విత్‌ ట్రూత్‌’, ‘గ్రామస్వరాజ్యం’, ‘స్వామి వివేకానంద జీవితచరిత్ర’ నన్ను అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన పుస్తకాలు. ముఖ్యంగా ‘ఎంతటి జ్ఞానం ఉన్నా, అది సమాజ హితం కానప్పుడు ఆ జ్ఞానం విలువ శూన్యం’ అన్న వివేకానంద మాటలు నన్ను అమితంగా ప్రభావితం చేశాయి. నా ఇంట్లో కనీసం ఐదు వేల పుస్తకాలతో చిన్న లైబ్రరీ ఉంది. అందులో కొన్ని మొత్తంగా చదివాను. మరికొన్ని చూచాయిగా చదివాను. మార్కెట్లోకి ఏ మంచి పుస్తకం వచ్చినా కొంటాను. ప్రతి రోజూ రాత్రి తప్పనిసరిగా ఏదో ఒక పుస్తకం చదవడం నా నిత్యజీవితంలో భాగం. గతవారం ‘‘ఓషో’’ రచనలు చదివాను. ప్రస్తుతం ‘‘పతంజలి యోగశాస్త్ర’’ చదువుతున్నాను. ఆ తర్వాత మన జీవితాలను మార్చిన 20వ శతాబ్ది పుస్తకాలను చదవాలనుకుంటున్నాను.