కవాడిగూడ, హైదరాబాద్, డిసెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంలో ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌ వాడకం పెరిగినప్పటికీ పుస్తకాలకు ఆదరణ తగ్గలేదనడానికి నిదర్శనం హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన అని మాజీ స్పీకర్‌ మధుసూదనచారి అన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న 33వ జాతీయ పుస్తక ప్రదర్శనలో భాగంగా బుధవారం నోముల సత్యనారాయణ వేదికపై జరిగిన ఇన్‌ఫినిటిజమ్‌ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం అంతర్భాగమైందని, ఈ విజ్ఞాన బాంఢాగారాన్ని అర్థం చేసుకుని ప్రపంచానికి చెప్పగలిగితే నోబుల్‌ బహుమతి సాధించే జ్ఞానం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ గడ్డం శ్రీనివా్‌సయాదవ్‌, బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు గౌరీశంకర్‌, కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.