ఆంధ్రజ్యోతి,హైదరాబాద్: దేశంలోనే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను నెంబర్‌ వన్‌ స్థానంలోకి తీసుకెళ్లాలని, అదే విధంగా వచ్చే సంవత్సరం నిర్వహించే పుస్తక ప్రదర్శన వినూత్నంగా ఉండే విధంగా కృషి చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్వాహకులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ 30వ జాతీయ పుస్తక ప్రదర్శనలో భాగంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పుస్తక ప్రదర్శనను సందర్శించి పలు స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం జరిగిన పుస్తక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతి, చరిత్ర, జానపద సాహిత్యం వెలుగులోకి వచ్చిందని, దానిని పుస్తక రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, బీసీ కమిషన్‌ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్ధాల అశోక్‌తేజ, బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఫౌండర్‌ సభ్యులు గోపాల్‌రావు, రాజేశ్వర్‌, ప్రసాద్‌శర్మ, సురేష్‌శర్మ, శృతికాంత భారతి, మూర్తిలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సత్కరించారు.