హైదరాబాద్‌: ఒక వస్తువును కవిత్వంగా ఎలా మలచాలో తెలిసినవాడు ప్రసాదమూర్తి అని ఆచార్య ఎన్‌. గోపి కొనియాడారు. శనివారం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కవి సంధ్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రసాదమూర్తి రచనల ఆవిష్కరణ సభ జరిగింది. కార్య క్రమంలో తొలిగా ‘‘చేనుగట్టు పియానో’’ కవితా సంపుటిని ఎన్‌.గోపి ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రముఖ పాత్రికేయులు, కవి అరుణ్‌సాగర్‌ సహచరి ప్రసన్నకి అందచేశారు. సిద్ధాంత పరిశోధనా గ్రంథం ‘‘ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం’’ పుస్తకాన్ని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఎన్‌. గోపి మాట్లాడుతూ రైతు పాడుతున్న మృత్యుగీతను కవి మలిచిన తీరు హృదయాన్ని మీటుతుం దన్నారు.కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రసాదమూర్తి కవిత్వాన్ని ఇష్టపడతాను, అందుకు కారణం ఆయన అరుణ్‌సాగర్‌ మెచ్చిన కవి కావడమే అన్నారు. ఎంతటి తీవ్రమైన విషయాన్నైనా లాలిత్యంతో చెప్పడం ప్రసాదమూర్తి కవిత్వం ప్రత్యేకతని శ్లాఘించారు. రోహిత్‌ వేముల మరణం, నిర్వాసిత్వతం, కల్బుర్గి హత్య వంటి సం ఘటనలపై బోలెడంత కవిత్వాన్ని నిర్మించి, సున్నితత్వంగా చెప్పడం ప్రసాదమూర్తి సామాజిక, రాజకీయ భావాలకి నిదర్శనం అని అభినందించారు. సినీనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి సాహిత్యపేజీలో ప్రచురితమైన కవితలను చదివి, నచ్చితే వెంటనే ఆ కవులకి ఫోన్‌ చేసి మాట్లాడుతుంటానన్నారు. అలా పరిచయమేర్పడి ప్రసాద మూర్తి సభకి వచ్చేలా చేసిందని తెలిపారు. వాక్యం రసాత్మ కం కావ్యం అంటారు, ప్రసాదమూర్తి ప్రతి వాక్యం రసాత్మ కంగా ఉందని కీర్తించారు. అధ్యక్షత వహించిన ప్రముఖ కవి కె. శివారెడ్డి మాట్లాడుతూ ఈ పుస్కకావిష్కరణ సభకి అరుణ్‌ సాగర్‌ వేదికగా పేరు పెట్టడంతోపాటు, అతని స్మృతికి అంకితమివ్వడం ప్రసాదమూర్తి, సాగర్‌ మధ్య స్నేహబంధం ఎంత దృఢమైందో తెలుపుతుందన్నారు. కార్య క్రమంలో విమర్శకుడు లక్ష్మినరసయ్య, డా. పిల్లల మర్రి రాములు, కొండేపూడి నిర్మల, శిఖామణి, మువ్వా శ్రీనివాసరావు,శ్రీరాములు,తనికెళ్ల భరణి పాల్గొన్నారు.