డాక్టర్‌ కేశవరెడ్డి రచించిన సుప్రసిద్ధ నవల ‘అతడు అడవిని జయించాడు’ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఇదివరకు కొన్ని అంతర్జాతీయ డాక్యుమెంటరీలను తీసిన దూలం సత్యనారాయణ ఈ నవలను సినిమాగా మలచాలని సంకల్పించారు. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌గా దీన్ని తీర్చిదిద్దాలనేది ఆయన ప్రయత్నం. అయితే ఆయనకంటే ముందు ఈ నవలను సినిమాగా తియ్యాలని ఒక పేరుపొందిన దర్శకుడు అనుకున్నాడు. ఆయన.. క్రిష్‌! అవును. కేశవరెడ్డి రచనలంటే క్రిష్‌కు బాగా ఇష్టం. అందుకే తెలుగు సాహిత్యంలోని విశిష్ట నవలల్లో ఒకటిగా పేరుపొందిన ‘అతడు అడవిని జయించాడు’లో సినిమా తీయడానికి తగిన ఆసక్తికర అంశాలు ఉన్నాయని ఆయన నమ్మాడు. ఇంకేముంది.. స్ర్కిప్టును కూడా తయారు చేశాడు. పతాక సన్నివేశాల్ని నవలలో ఉన్నదానికంటే మరింత ఆసక్తికరంగా మలచాడు. సీనియర్‌ హీరో వెంకటేశ్ కు వినిపించాడు. ఆయన కూడా ఓకే అనేశాడు. ఇక నవల హక్కుల్ని తీసుకోవడమే తరువాయి. ఆయన ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఆ హక్కుల్ని దూలం సత్యనారాయణ పొందినట్లు, సినిమాగా తీయబోతున్నట్లు వార్త వచ్చేసింది. దీంతో హతాశుడయ్యాడు క్రిష్‌. చేసేదేముంది! వెంకటేశ్ ను కలిసి విషయం వివరించి, సారీ చెప్పేశాడు. ముందుగానే నవల హక్కుల్ని పొందినట్లయితే ఆయనకు ఈ తిప్పలు వచ్చి ఉండేవి కాదు.