12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్య దుర్భర జీవనం

హైద్రాబాద్‌ సింగరేణి కాలనీ మురికివాడలో నివాసం
చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న కొడుకు, కూతురు

నాగర్‌కర్నూల్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జులపాల జుట్టు, పంచెకట్టు, నిలువెల్లా పల్లెటూరి అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనిపించే ఆ నిరుపేద కళాకారుడు.. 52 దేశాల ప్రతినిధులను తన 12 మెట్ల కిన్నెర గానంతో ఉర్రూతలూగించాడు. ‘ఆడా లేడు మియ్యా సావ్‌.. ఈడా లేడు మియ్యా సావ్‌’ ..అంటూ ఆయన ఆలపించే గానం వింటూ శ్రోతలు మైమరచిపోతారు. 12 గంటల పాటు నిరాటంకంగా వీరుల గాథలను వివరిస్తూ కిన్నెర గానంతో ఆయన చేసే కచేరీ ఆబాలగోపాలాన్నీ అలరిస్తుంది. ఆయనే..అరుదైన 12 మెట్ల కిన్నెర కళాకారుడు, నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకులకు చెందిన దర్శనం మొగులయ్య. ఆయన జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా కూడా ఉంది.
 
కానీ.. ఆయన జీవితమే దుర్భరంగా ఉంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్న దర్శనం మొగులయ్య.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక మురికివాడలో అత్యంత దీనస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. చిన్న రేకుల ఇంట్లో అద్దెకుంటూ.. పూటపూటా తిండికి అలమటిస్తున్నారు. భర్తను కోల్పోయి తన వద్దకే వచ్చి ఉంటున్న కూతురు రాములమ్మ.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న కుమారుడు మహేందర్‌ వీధుల్లో చెత్త ఏరి, దాన్ని అమ్మగా వచ్చే అరకొర ఆదాయుయంతో కలోగంజో తాగుతూ బతుకుబండిని లాగిస్తున్నారు. చెత్త దొరకని రోజున పస్తులు తప్పట్లేదని మొగులయ్య ‘ఆంధ్రజ్యోతి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలో రేషన్‌ కార్డు మీద వచ్చిన కంట్రోల్‌ బియ్యం తెచ్చుకుంటున్నామని.. ఇంటి అద్దె కట్టడానికి, అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడు మహేందర్‌కు చికిత్స చేయించడానికి డబ్బులు సరిపోవట్లేదని కన్నీటిపర్యంతమయ్యారు. కొన్నిసార్లు కూరగాయలు కొనుక్కోలేక గొడ్డుకారంతో సరిపెట్టుకుంటున్నామని చెప్పారు. సుస్తి చేసి భార్య శంకరమ్మ మంచాన పడితే దవాఖానాలో చూపించేందుకు చిల్లిగవ్వ లేక పరిస్థితి విషమించి ఆమె కొద్దికాలం కిత్రం చనిపోయారు.
 
ప్రభుత్వమే ఆదుకోవాలి
క్రీడలలో రాణిస్తున్న వారికి కోట్ల రూపాయల కానుకలిస్తున్న ప్రభుత్వం.. అరుదైన 12 మెట్ల కిన్నెర వాద్యాన్ని అద్భుతంగా వినిపించే కళాకారుడు మొగులయ్యను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రజా కళాకారుడిగా ఒక ఇల్లు, జీవనభృతి కల్పిస్తే ఆయన్ను గౌరవించుకున్నట్లుగా ఉంటుందని.. ఆసక్తి ఉన్నవారికి ఆయన వద్ద 12 మెట్ల కిన్నెర వాద్యంలో శిక్షణ ఇప్పిస్తే అంతరించిపోతున్న ప్రాచీన కళకు జీవం పోసినట్లవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.