గుంటూరు్: మానసిక ఉల్లాసం, ఆనందానికి లలిత కళలు దోహదం చేస్తాయని వీసీ ఆచార్య ఎ.రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. వర్సిటీ ఎన్టీర్‌ లలిత కళాపీఠం ఆధ్వర్యంలో శనివారం ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియంలో నెలనెలా మన కళ నినాదంతో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగు విభాగ అధ్యాపకుడు ఆచార్య వరప్రసాదమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ఆచార్య రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో లలిత కళాపీఠం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. రిజిస్ర్టార్‌ ఆచార్య కె.జాన్‌పాల్‌ మాట్లాడుతూ మహామనిషి ఎన్టీఆర్‌ పేరుతో కళాపీఠం ఏర్పాటు అభినందనీయమన్నారు. ప్రతి నెలా సాంస్కృతిక కార్యక్రమాలను సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. పాలకమండలి సభ్యుడు ఆచార్య ఎం.కోటేశ్వరరావు మాట్లాడుతూ కళాపీఠం ఆధ్వర్యంలో యాంకరింగ్‌, న్యూస్‌ రీడింగ్‌ వంటి కోర్సులతో పాటు వాస్తుశాస్త్రం, మ్యూజిక్‌, డాన్స్‌ వంటి కళల్లో శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తోట సిల్వస్టర్‌ ధ్వన్యనుకరణ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో నూటా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ జిరోశయ్య, డాక్టర్‌ జి.సింహాచలం, తెలుగు విభాగం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌బీ కృష్ణారావు పాల్గొన్నారు.