అతను నాతో మాట్లాడాల్సింది

నేనైనా అతనితో మాట్లాడాల్సింది
మాటల్లేనపుడే కదా మనుషులు
మౌనంలోకి జారిపోతారు
లోలోపలి అఖాతాల్లోకి 
కూరుకుపోతారు
ఎవరో ఒకరు మాట్లాడాల్సింది
 
మాటలతోనే కదా
తనచుట్టూ ఒక ప్రపంచముందని
తనకోసం పరితపించే
తనకంటూ మిగిలిన 
ఒకానొక ప్రపంచముందని తెలిసేది
 
ఏకాంత ద్వీపమై
ఆలోచనల అలలతో 
తన లోపలి తీరం
కొద్ది కొద్దిగా గుండె కోతకు 
గురవుతున్నపుడు
మాట్లాడాల్సింది
 
దిగులు పొగ
తన హృది అంతా పరుచుకుని
ఊపిరాడక మనసంతా
ఉక్కిరిబిక్కిరవుతున్నపుడు
తప్పక మాట్లాడాల్సింది
 
చీకటిగదిలో ఆరిపోతున్న దీపం వంక
తదేకంగా చూస్తూ గడుపుతున్న
అతని గదితో ఎవరైనా మాట్లాడాల్సింది
నేనో నువ్వో అతనో ఆమో
ఎవరో ఒకరు తప్పక మాట్లాడాల్సింది
 
మాట్లాడటానికో 
మనిషంటూ లేనిచోట
అతను శాశ్వతంగా 
మౌనంలోకి జారిపోవటం 

ఎంత విషాదం

*********
చిత్తలూరి
82474 32521