ఆకాశదేవర నాటక ప్రదర్శన సందర్భంగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ బలరామయ్య

విజయవాడ కల్చరల్‌ : తెలుగు నాటక రంగం పరిషత్‌లకే పరిమితమైందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిజి.బలరామయ్య అన్నారు. సురభి శంకర్‌ నిర్వహణలో గోవాడ క్రియేషన్‌ హైదరాబాద్‌ బృందం ఆకాశదేవర నాటక ప్రదర్శన సోమవారం సత్యనారాయణపురం ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నాటకాన్ని ప్రదర్శించాలంటే ఆడిటోరియంలు అవసరమని, ప్రతి జిల్లాకు అన్ని సదుపాయాలున్న ఆడిటోరియం ఒకటైనా కావాలన్నారు. అప్పుడే నాటక రంగం అభివృద్ధి చెందగలదన్నారు. ప్రతిభగల నటులు, నాటకాలను ఆదరించే ప్రేక్షకులు ఉన్న రంగ స్థలానికి కావల్సిన సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాటక రంగానికి తగిన ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్‌ సంస్థలు, సేవా సంస్థలు భాగస్వామ్యం వహించాలని బలరామయ్య కోరారు.ఆకాశదేవర అంతా అబద్ధమే...హైదరాబాద్‌ గోవాడ క్రియేషన్స్‌ బృందం ప్రదర్శించిన ఆకాశదేవర దొంగస్వాములు లీలను ఎండగట్టింది. ఆకాశదేవర అంతా అబద్ధమేనని, స్వామిజీల నకిలీతనాన్ని బట్టబయలు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జి.బలరామయ్య ప్రధాన పాత్రగా శూన్యస్వామి పోషించి మెప్పించారు. వెంకట్‌ గోవాడ, రజిత మూర్తి, సుధాకర్‌, సురభిరాఘవ, కె.శ్రీనివాసరావు, పి.శ్రీనివాస్‌, సురభి సంతోష్‌, మీసాల లక్ష్మణ్‌, టి.వి.సుబ్బారావు, ప్రణయ్‌రాజ్‌, గిరిలు చక్కని పాత్రలతో నటనాభినయంతో నాటకాన్ని రక్తికట్టించారు. సందేశాత్మకంగా సాగిన ఈ నాటకాన్ని నగ్నముని అందించగా పాటిబండ్ల ఆనందరావు మాటలు, రూపకల్ప చేశారు. బలరామయ్య దర్శకత్వం వహించారు. థామస్‌- ఆహార్యం, సురభశంకర్‌, సంతోష్‌, సెట్టింగ్స్‌తో సహకారమందించారు. కార్యక్రమంలో హనుమాన్‌, డాక్టర్‌ ఎస్‌.రాధలు పాల్గొన్నారు.