సాయికృష్ణయాచేంద్రకు సాలూరి రాజేశ్వరరావు పురస్కారం

హైదరాబాద్, రవీంద్రభారతి : చిన్నతనంలో వేదికలపై సాలూరి రాజేశ్వరరావు పాటలు అనేకం పాడుతూ పెరిగానని ప్రముఖ గాయని జానకి తెలిపారు. శుక్రవారం తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో రసమయి సంస్థ ఆధ్వర్యంలో సంగీత సామ్రాట్‌ సాలూరి రాజేశ్వరరావు 95వ జయంత్యుత్సవం సందర్భంగా ఆయన పేరిట నెలకొల్పిన స్మారక పురస్కారాన్ని ప్రముఖ సంగీత గేయకవి వి.బి.సాయికృష్ణ యాచేంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాన కి సాయికృష్ణ యాచేంద్రను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ రాజేశ్వరరావు సినిమా పాటలే కాకుండా ప్రైవేటు పాటలు రాసి ప్రేక్షకులకు చేరువయ్యారని అన్నారు. రాజేశ్వరరావుకు పెద్ద అభిమానినని తెలిపారు. పగలే వెన్నె లా.. అనే పాట తెలుగు ప్రేక్షకుల జీవితాల్లో మరిచిపోలేరని అలాంటి పాట తాను పాడడంతో అదృష్టమని అన్నారు. సభాధ్యక్షత వహించిన డాక్టర్‌ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ అస్తవ్యస్త వ్యవస్థలో మనసు గాయమైనపుడు రాజేశ్వరరావు పాటలు వింటే హాయిగా ఉంటుందని అన్నారు. లలిత సంగీతానికి పరిమళం అద్ది సినిమాలకు అందించిన ఘనత ఆయనదని అన్నారు. కార్యక్రమం లో పి.విజయబాబు, సంగీత దర్శకుడు కోటి, సాలూరి వాసురావు, రోషన్‌ సాలూరి ఎం.కె.రాము, ఆశాలత తదితరులు పాల్గొని సాయికృష్ణయాచేంద్రను సత్కరించారు. అంతకుముందు రాజేశ్వరరావు స్వరపరిచన చిత్రాల్లోని పాటలను ఆలపించారు. పలు మధురమైన గీతాలతో ప్రేక్షకులను అలరించారు.