పూర్ణిమ తమ్మిరెడ్డి  : పలకరింపు 
 

విభజన నెత్తుటి సంద్రంలో మంటో ఏరిన ముత్యాలు‘‘దేశ విభజన వల్ల పెనుమార్పులు సంభవించాయి... సాటి మనుషుల నరాల్లోంచి మనిషి పారించిన ఆ నెత్తుటి సముద్రంలోకి నేను మునకలేసి కొన్ని ముత్యాలని ఏరుకొచ్చాను. ఎంతో చెమటోడ్చి, ఎన్నో కష్టాలకోర్చుకునిమరీ మనిషి తన పక్కవాడి రక్తాన్ని చివరి బొట్టు వరకూ చిందించగలిగాడు. అంతటి కర్కశత్వంలోనూ ఎందుకని తామింకా మానవత్వాన్ని పూర్తిగా కోల్పోవడంలేదో అర్థంకాక మనుషుల కళ్ళల్లోంచి కారిన కన్నీళ్ళనీ, ఆ ముత్యాలనీ, నేను నా పుస్తకం ‘సియా హాషియే’లో సమర్పించాను.’’ - మంటో

 
దేశవిభజన నేపథ్యంలో సాదత్‌ హసన్‌ మంటో రాసిన కథలను ‘సియా హాషియే: విభజననాటి నెత్తుటి గాయాలు’ పేరిట పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ఈ సందర్భంగా ఆమెతో ‘వివిధ’ పలకరింపు.
 
ప్రశ్న: మంటోని మొదటిసారి చదివినప్పటి అనుభవం గురించి చెప్పండి? 
నేను మంటోని మొదటిసారిగా చదవలేదు, విన్నాను. 2012లో సూత్రధార్‌ అనే హైదరా బాద్‌ నాటక సంస్థ వేసిన ‘సియా హాషియే’ నాటకం చూసాను. అక్కడ నుంచే మంటోతో నా ప్రయాణం మొదలైంది. అప్పట్లో అందుబాటులో ఉన్న ఆంగ్లానువాదాలు చదివాను కానీ వాటిలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ముఖ్యంగా అనువాదం చేయడంతో పాటు అనువాదకులు కథలను ‘ఎడిట్‌’ చేయడం ఒప్పుకోలేకపోయాను. అందుకని రాజ కమల్‌ ప్రకాశన్‌ వారు వేసిన ‘దస్తావేజ్‌ మంటో’ సీరీస్‌ (ఐదు పుస్తకాలు) కొనుక్కుని చదివాను. ఇవి ఉర్దూభాషలో ఉంటూనే దేవనాగరి స్ర్కిప్ట్‌లో (transliterated) ఉంటాయి. ఇలా దేవనాగరిలో అందుబాటులో లేని రచనలకోసం, గత కొన్నేళ్ళుగా ఉర్దూ లిపి చదవడం, రాయడం నేర్చుకుంటున్నాను. 
 

మంటో విలక్షమైన రచయితన్న సంగతి ఆ నాటకంతోనే అర్థమైపోయింది. అలతి పదాలతో లోతైన భావోద్వేగాలను, సంక్లిష్టమైన మానసిక సంఘర్షణలను పట్టుకోగలడు. కథా రచయితగా పాత్రలపై సానుభూతి ఉండదు, సహానుభూతి తప్ప. వ్యాస రచయితగా తీసుకున్న అంశాన్ని లోతుగా, సహేతుకంగా తర్కించగలడు. అన్నింటిలోనూ కనీకనిపించని హాస్య, వ్యంగ్యపు పొర ఒకటి ఉంటుంది. మంటోపై నా తొలి ఇంప్రెషన్స్‌ ఇవే. 

ప్రశ్న: మంటో కథలకు తెలుగులో ఇదివరకు కూడా కొన్ని అనువాదాలు వచ్చాయి. ఇప్పుడు మీ అనువాదం ఏ రకంగా కొత్త చేర్పు అంటే ఏం చెప్తారు?
మంటో కథలు మాత్రమే ఇప్పటివరకు ఎక్కువగా అనువదించబడ్డాయి. ‘సియా హాషియే: విభజననాటి నెత్తుటి గాయాలు’ అనే పుస్తకం ఒక ప్రత్యేకమైన దృక్పథంతో కూర్చిన పుస్తకం. భారత ఉపఖండంలో విభజన ఒక చారిత్రక ఘటనే అయినా... దానికి ముందు, తర్వాత కూడా అనేక దశాబ్దాలుగా మతాలు, వర్గాల మధ్య వేర్పాటుతనం నడిచింది, నడుస్తూనే ఉంది. మంటో రాసిన కథలు, వ్యాసాల ద్వారా ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయ త్నమే ఈ పుస్తకం. 1948లో ‘సియా హాషియే’ పుస్తకాన్ని మంటో ప్రచురించినప్పుడు వేసిన ముందుమాట, ఆపైన మతకల్లోలాల గురించి సాహిత్యంలో ఏం రాయాలి, ఎలా రాయాలన్న నాటి ఉర్దూ సాహిత్యకారుల తర్జనభర్జనల్లో కూడా కొన్నింటిని అనువదించి ఇందులో చేర్చాను. 
 

మంటో అనువాదాలు తెలుగులో ఇప్పటికే వచ్చేశాయని, ఇక అవసరం లేదని తరచుగా వినిపించే ఒక అభిప్రాయం. ఇదేమీ తరగతి గదుల్లో ఇచ్చే మొక్కుబడి హాజరీ తంతు లాంటిది కాదు కదా, మంటోకు ఒకసారి తెలుగులో హాజరీ వేయించేశాం, మరిక అక్కర్లేదు అనుకోడానికి. ‘‘ఫలనా రచయిత ఫలనా భాషలో ఫలానా రాశాడు, చూడు’’ అని చెప్ప డంతో అనువాదకురాలిగా నా పనైపోతుందని నేననుకోను. ఆయన రచనలతోపాటు మంటో నాటి సామాజిక, రాజకీయ, సాహిత్య పరిస్థితులను తెలుగువాళ్ళకి పరిచయంచేసే బాధ్యత కూడా నేను తీసుకోదలిచాను. ఆయన textని, contextని రెంటినీ తెలుగువాళ్ళ దగ్గరకు వీలైనంత మేరకు తీసుకురావాలని నా తాపత్రయం. మంటో అనువాదాలు ఎన్నైనా వచ్చుం డచ్చు, భవిష్యత్తులో రావచ్చు. వాటన్నింటి మధ్యన కూడా పూర్ణిమ చూపెట్టే ‘‘మంటో’’ ప్రత్యేకంగా నిలువగలడు. నాకా నమ్మకముంది.

ప్రశ్న: అనువాదపరంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ళు ఎలాంటివి? 
పైన చెప్పినట్టు ఈ పుస్తకంలో మంటో కథలు, వ్యాసాలూ రెండూ ఉంటాయి. మంటో కథల్లో వాక్యం సరళంగా, భాషలో భారీ పదబంధాలు లేకుండా హాయిగా సాగిపోతుంది. కానీ వ్యాసాల్లో మాత్రం (ముఖ్యంగా ఆయన విచలిత మనసుతో రాసినవి) సంక్షిష్టమైన భావోద్వేగాలకు అనుగుణంగా పొడవాటి వాక్యాలు, కష్ట తరమైన ఉర్దూ పదబంధాలుంటాయి. వేర్వేరు సందర్భాల్లో, ఒక ఏడెనిమిదేళ్ళ కాలంలో మంటో రాసినవాటిని నేను పక్కపక్కన పెట్టి తెలుగు పాఠకుల కోసం ఒక విస్తారమైన కథనాన్ని (overarching narrative) బిల్డ్‌ చేస్తున్నాను కాబట్టి, ఆనాటి సంగతులు అర్థమ య్యేలా వివరాలు ఇస్తూనే, మంటో శైలికి వీలైనంత దగ్గరలా అనువాదాలు చేశాను. 
 

మంటోతో పాటు మహమ్మద్‌ అస్కరీ అనే ప్రముఖ ఉర్దూ విమర్శకుని రెండు వ్యాసాలూ అనువదించాను. వాటిల్లో పునరుక్తి ఎక్కువ, విషయాన్ని సూటిగా చెప్పడం ఉండదు. తెలుగు పాఠకులకు మరీ ఎక్కువ శ్రమ కలుగ కుండా వాటిల్లో వాక్యనిర్మాణాన్ని కొంచెం సరళతరం చేయాల్సి వచ్చింది. (ఆయన శైలికన్నా చెప్తున్న విషయం ముఖ్యం కాబట్టి.) ఈ పుస్తకం ముందుమాట రాయడానికి దాదాపు పాతిక వరకూ ఇంగ్లీషు/ ఉర్దూ పుస్తకాలు రిఫర్‌ చేశాను. వాటిల్లోంచి ఉటంకించిన వాక్యాలన్నీ తెలుగు లోకి అనువదించాను. ఆయా భాషల్లో వాడుకలో ఉన్న పదబంధాలకు తెలుగులో అవే అర్థం ఇచ్చేవి లేనవనిపించి నప్పుడు ప్రత్యేకంగా వివరణలు ఇచ్చాను. 

ప్రశ్న: ఈ పుస్తకమే మొదటి ప్రచురణగా, మీరు మరో ఇద్దరు స్నేహితులతో (రోహిత్‌, ఆదిత్య కొర్రపాటి) కలిసి ‘ఎలమి’ అన్న పుస్తక ప్రచురణ సంస్థను మొదలు పెట్టారు. ఈ ప్రయత్నం గురించి చెప్పండి?
ప్రతీ నాలుగేళ్ళకి ఒకసారి వచ్చే ఒలంపిక్స్‌ అప్పుడు ‘‘వందకోట్ల జనాభా! అయినా మెడల్స్‌ మాత్రం ఒకటి రెండు’’ అని మనవాళ్ళు వాపోతుంటారు. ఎందుకు మెడల్స్‌ రావడం లేదో అర్థం చేసుకుని, మెడల్స్‌ రావడానికి ఏం చేయాలో చూస్తేనే కదా status-quo మారేది? తెలుగు సాహిత్యలోకంలో కూడా, ‘‘వేయి కాపీలు అమ్మలేకపోతున్నాం’’, ‘‘చదివేవారికన్నా రాసేవారు ఎక్కువైపోయారు’’, ‘‘తెలుగువాళ్ళకు పుస్తకాలు చదవడంపై ఆసక్తి లేదు’’ లాంటి మాటలే వినిపిస్తుంటాయి. ఈ వాక్యాల వెనుకున్న వాస్తవాలని మా పరిమితుల్లో అనలైజ్‌ చేశాక అర్థమైన సంగతి: తెలుగులోనే వ్యక్తీకరించే రచయితలు, కవులకు లోటు లేదు. తెలుగు అక్షరాన్ని కళ్ళల్లో నింపుకుని చదవడానికి ఇష్టపడే పాఠకులకూ కొదవలేదు. వీరిద్దరిని కలపగలిగే బుక్‌ మార్కెటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌లో మనం దారుణంగా వెనుకబడి ఉన్నాం. ఈ పరిస్థితిని మార్చడానికి (లేదా, మారడంలేదని చెప్పబోయే ముందు) ఒక గట్టి ప్రయత్నమే చేయాలనుకున్నాం. అదే ఎలమి ప్రచురణలకు బాట వేసింది. 
 

పుస్తక రూపకల్పనలో భాగస్వామ్యులైన రచయిత, ఎడిటర్‌, బుక్‌ డిజైనర్‌, కవర్‌ డిజైనర్‌ లందరికీ వారి వారి మేధోశ్రమకు తగిన పారితోషకం ఇస్తూనే, పైసాపైసా కూడబెట్టుకుని పుస్తకాలు కొనుక్కునే పాఠకులకు సరసమైన ధరల్లో నాణ్యతగల పుస్తకాలని అందించ గలమా? - ఈ ప్రశ్నకు జవాబు వెతుక్కోడానికే ‘ఎలమి’ని మొదలుపెట్టాం. 

*******************

ఎలమి ప్రచురణలు (వాట్సాప్‌) - 82474 74541