సిరిసిల్ల, జనవరి 15(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పాత్రికేయుడు, ‘ఆంధ్రజ్యోతి’ నవ్య వారపత్రిక సంపాదకుడు, కథా రచయిత ఏఎన్‌ జగన్నాథ శర్మ ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య అవార్డు’కు ఎంపికయ్యారు. ఆయనతోపాటు ప్రముఖ రచయిత వినోదినిని కమిటీ ఎంపిక చేసింది. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కార కమిటీ, రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు రంగినేని మోహన్‌రావు, కన్వీనర్‌ మద్దికుంట లక్ష్మణ్‌, అఖిల భారత తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 2016 ఏడాదికిగాను కథా పురస్కారం కోసం 56 కథా సంపుటాలు రాగా.. న్యాయ నిర్ణేతలు ఏఎన్‌ జగన్నాథ శర్మ ‘కథా స్రవంతి’ని, రచయిత ఎంఎం వినోదిని ‘బ్లాక్‌ ఇంక్‌’కు సమాన మార్కులు ఇచ్చారు. ఫిబ్రవరి మూడో వారంలో ఈ అవార్డును అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.