రచయిత డా. గరికపాటి నరసింహారావు

హైదరాబాద్: ప్రపంచచరిత్రలోని పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, వైజ్ఞానిక, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక విషయాలను భారతీయ తాత్విక చింతనా నేపథ్యంలో వర్ణించే పుస్తకం ‘సాగరఘోష’. మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహరావు రచించిన ఈ పుస్తకం బుక్‌ఫెయిర్‌లోని నవోదయ బుక్‌హౌస్‌ స్టాల్‌నెంబర్‌ 129లో దొరుకుతుంది. ‘సాగరఘోష’ గురించి కవి - అంతరంగం సంక్షిప్తంగా ఇది. ‘ఇది విశ్వకావ్యం. భూమి చరిత్రే ఈ కావ్యంలోని ఇతివృత్తం. మానవుడే దీనిలో నాయకుడు. ఇది మనిషి కథ. కోట్ల ఏళ్ల నాటి భూమి పుట్టుక నుంచి నిన్న మొన్నటి ఘట్టాల వరకు ఇంచుమించుగా మానవుని మహాప్రస్థానంలోని అన్ని సంఘటనలు ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇది పర్యావరణ పద్యకావ్యం. మనిషి భౌతిక పరిసరాలు అందంగానూ, ఆనందదాయకంగానూ తీర్చిదిద్దుకోవాలని, మనసులో స్వార్థాన్ని తగ్గించుకొని, పరమార్థం గురించి ఆలోచించాలని తెలియజెప్పే కావ్యం ఇది. ఆదిశంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో అన్ని దేశాల సాంస్కృతిక చరిత్రను పరిశీలించి, విశ్లేషించిన కావ్యం. ఇది 116 పద్యాలతో నిండిన కావ్యం. ఒక ఆశ్వాసానికి 108 చొప్పున 10 అశ్వాలు ఉన్నాయి. అవతారికలో 36 పద్యాలు ఉన్నాయి. వృత్తాలు పాతవే అయినా, ఇతివృత్తాలు కొత్తవి. ఒకానొక ఫ్రౌడవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చొని, సముద్రాన్ని వర్ణిస్తూ తన్మయస్థితిలో ఉంటాడు. కెరటం చెప్పిన మానవుని జీవిత కథే ఈ సాగరఘోష. ప్రపంచ దేశాల సాంస్కృతిక చరిత్రను భారతీయ తాత్తివ్వక చింతనా నేపథ్యంలో వర్ణించే ఈ కావ్యరచన మంచి కోసం, మార్పుకోసం...మనిషికోసం..’ అంటారు.

మొత్తం పేజీలు 466.వెల : రూ. 250.