ఇప్పుడు సారామీద నిషేధం లేదు. కల్తీసారా ఉందిగానీ దొంగసారా లేదు. మద్యం పరిశ్రమ మొత్తంగా బహిరంగంగా, బట్టబయలుగా, సజావుగా ఉంది. దొంగచాటుగా సారాకాచే ముత్యా లమ్మలూ లేరు. ‘మూడోకంటివాడికి తెలీకుండా’ సరకుని సరఫరా చేసే రాకెట్‌ అప్పారావులూ లేరు. రావిశాస్త్రి రాసిన ఆరు సారా కథలున్నాయి. అవి ఇప్పటికీ మనల్ని నవ్విస్తూనే ఏడిపిస్తాయి. వాటిల్లో ఏదో నిత్యనూతనత్వం ఉంది. అది ఏమిటనే ప్రశ్నకు జవాబు వెతికే ప్రయత్నమే ఈ వ్యాసం. 

 

మన వ్యవస్థని ఒక పిరమిడ్‌గా ఊహించుకుంటే - అట్టడుగున ఉండే పునాదిరాళ్లు - నిత్యం దోపిడికి గురయ్యే కష్టజీవులూ, నిరుపేదలూనూ. వాళ్లే ఆ నిర్మాణానికి మూలం, మొత్తంగా విస్తరించి ఉండే బలమైన ఆధారం. ముత్యాలమ్మలు, పోలమ్మలు అక్కడే ఉంటారు. రావిశాస్త్రికి అత్యంత ప్రగాఢమైన సానుభూతి వీరిపట్లనే. వీళ్లనేమీ అనడు, అనని వ్వడు. వీళ్ల మీద ఈగ వాలకుండా కాపాడతాడు తన రచనల్లో. వీరి శ్రమమీద బ్రతికే నీలయ్యల మీదా, దాసులమీదా, అలాగే ‘దబాయింపు సెక్సను’ తో దూసుకుపోయే రాకెట్‌ అప్పారావుల మీదా, హేడ్డుగారిమీదా, జూనియర్‌ లాయర్లమీదా రావి శాస్త్రికి ద్వేషంలేదుగానీ, వాళ్లని వ్యవస్థ చేతుల్లోని సాధనాలుగా గుర్తించి, తన హాస్యానికీ, కలానికీ లక్ష్యాలుగా మారుస్తాడు. అవసరమనుకున్న చోట్ల నాలుగు చురకలు అంటిస్తాడు. వారిమీద ఆధిపత్యం చెలాయించే వర్గాలు, జాతులు ఇంకా పైపొరల్లో ఉంటాయి. శిఖరాగ్రాన ఇంగ్లీషు వాడుంటాడు; వాడి నెత్తిన అమెరికా వాడుంటాడు -రావిశాస్త్రి స్కీములో. పెద్ద ఘటాలెవర్నీ విడిచిపెట్టడు. తనవద్దనున్న అన్ని అస్త్రాలతోనూ విరుచుకుపడతాడు, విజృంభిస్తాడు. చీల్చిచెండాడతాడు. చురకలతో ఊరుకోకుండా వాతలు పెడతాడు.

ఈ పిరమిడ్‌ వ్యవస్థని కాపాడడానికే రాజ్యం, పోలీసులూ, న్యాయ వ్యవస్థ రాత్రీపగలూ శ్రమిస్తా యని రావిశాస్త్రి దృఢంగా నమ్ముతాడు, తన పాఠకు లకు ఆ నమ్మిక కలిగిస్తాడు. అలగాజనం పట్ల తన కున్న అవ్యాజమైన ప్రేమనీ, వ్యవస్థపై తనకున్న ద్వేషాన్నీ పాఠకుల్లో రగిలిస్తాడు. రావిశాస్త్రికీ అతని పాఠకులకీ మధ్య ఉండే అనుబంధం ఏకకాలంలో హేతుబద్ధమూ, భావోద్వేగభరితమూ కూడా. అందుకే అతని శైలి ఏకకాలంలో సరళ వచనం, భావావేశ పూరితమైన కవిత్వం. ఈ రెండిటినీ సంధిస్తూ అతను జొప్పించే వర్ణనలు అతని శైలిలోని ప్రత్యేకత, విశిష్టతలు. అతను సృష్టించిన పాత్రలతో అతనే ప్రేమలో పడతాడనీ, అతని వర్ణనలు మోతాదుమించిపోతాయనీ అనే విమర్శకులున్నారు. ఇది రావిశాస్త్రి పద్ధతి అంటాన్నేను.

బాధితుల కష్టాల్ని ఎంతగా గుండె తరుక్కుపో యేలా వర్ణిస్తాడో, ఆ కష్టాలకు కారకులైనవారిని అంతగా గేలిచేసి, నడివీధిలో గుడ్డలూడదీసి వదిలి పెడతాడు. ఒకవైపు కరుణతోకూడిన విషాదం, మరో వైపు కసిని రగిల్చే హాస్యం - ఈ రెండింటి మేళ వింపు శాస్త్రిగారి రచనలు. విషాదభరితమైన హాస్యం నుండి జీవితపు సంక్లిష్టతలూ, అసంబద్ధతలూ, అన్యాయాలూ ఆవిష్కరింపబడతాయి. ఈ సంగతి నికొలాయ్‌ గొగోల్‌కి తెలుసు; చార్లీ చాప్లిన్‌కి తెలుసు. మన రాచకొండ విశ్వనాథశాస్త్రికి తెలుసు. సారా కథల్లో ఈ మేళవింపు స్పష్టంగా కనిపిస్తుంది. 

మొదటి సారా కథ ‘పాపి’లోనే రామదాసు పాత్ర ద్వారా సారా సామ్రాజ్యానికి పోలీసులతో, లాయర్లతో ఉండిన సత్సంబంధాల్ని మన కళ్ల ఎదుట నిలబెడ తాడు రావిశాస్త్రి. వారందరి సహకారంతోనే ‘మూడు బుడ్లూ, ఆరుగ్లాసులుగా సారా ప్రపంచం అంతా శాంతి-సామరస్యాలతో వర్థిల్లుతోంది’ అని మనకు తెలియజేస్తాడు.

‘మాయ’ కథలో సీనియర్‌ లాయరు, జూని యర్‌ లాయర్‌కి చేసిన హితబోధ - ‘వేశ్యలు వీధిగుమ్మాలు కనిపెట్టుకునుంటారు. నక్కలు శ్మశానాన్ని పట్టుకు వేళ్లాడతాయి. కొంగలు రేవుని కాసుకునుంటాయి. సామ్యం బావులేదు. కాని మనం చెయ్యవలసిన పనికూడా అదే. నువ్వు బాగుపడాలంటే ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకుం డాలి’- ఇది ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టతను సంతరించుకున్నది. ‘ఇంగ్లీషువాడి గుణగణా లను వర్ణించడంలో సీనియర్‌ లాయరుకి వళ్లు తెలీదు’. ఇదే కథలో ఎదురుపడి మనల్ని నిలదీసే ముత్యా లమ్మ ప్రస్తావన లేకుండా సారా కథలపై చర్చ పూర్తి కాదు. ‘ఈ నోకంల డబ్బూ యాపారం తప్ప మరేట్నేదు. పసువులు - నోర్లేని సొమ్ములు - ఆటికి నీతుంది గాని మనకి నేదు. చదువులేందాన్ని నాకూ నేదు. చదువుకున్నోడివి నీకూ నేదు... డబ్బుకి నేను సారా అమ్ముతున్నాను. డబ్బుకి నువ్వు సదివిన సదువంతా అమ్ముతున్నావు. పోలీసోల్లు నాయేన్నమ్ము తున్నారు... అమ్మకం తప్ప మరేట్నేదీ లోకంల’ అంటుంది ముత్యాలమ్మ. సీనియర్‌ లాయరు ఉప న్యాసం విన్నాక, ముత్యాలమ్మ గోడు వింటే మొత్తం సారా ప్రపంచం, దాన్ని నడిపించిన శక్తులూ, అవి సృష్టించే మాయ- అన్నీ ఒక్క ఉదుటన విశదమవుతాయి.

 

‘అసలు ఈ ప్రపంచమే భగవంతుడి పెద్ద కల్పన. అంతా మాయే అయిన ప్పుడు మాయలోంచి మాయగాక ఇంకేమిటొస్తుంది?’ సత్యా న్వేషకుడైన వెర్రిబాగుల మేజిస్ట్రేటుని ఉద్దేశిస్తూ ఒక పోలీసాయన ఈ మాటలం టాడు ‘న్యాయం’ కథలో. నేరం చెయ్యకపోయినా కోర్టులో తప్పు ఒప్పేసుకున్న ఒక వేశ్య, కుర్ర మేజిస్ట్రేటుని కలవరానికి గురిచేస్తుంది. అతను తికమక పడతాడు. ‘ఒక్కరాత్రికి అంతమంది ఇలా కరిసేసి, రక్కేసి, రక్తం తాగేసి, ప్రాణాలు తీసేస్తే... ఇందరు పీడరు బాబులు, ఇందరు జవాను బాబులు, ఇందరు ధర్మప్రభువులు - ఇంతమంది ఉన్నారు - నిన్న రాత్రి యేబాబొచ్చి అడ్డుకున్నాడు?... నన్ను చంపేయండీ’ అని ఆమె మొర పెట్టుకుంటుంది - హృదయవిదారకంగా.

‘మోసం’ కథలో హేడ్డుగారి ఉపన్యాసం వింటే అప్పటికీ, ఇప్పటికీ పోలీసుల అగచాట్లు ఏమంత మారలేదనిపిస్తుంది. ‘తెల్లార్లేస్తే నాలుగు సెవాలు, పదేక్సిడెంట్లు, యిరవై సోరీలు! ఈటి తోటి సస్తంటే ఇయి సాలక ఎయ్యిమందికి బందోబస్తులు... ఎడ్డికే సన్‌ మినిస్టరొహడు, ఎగ్రికల్చర్‌ మినిస్టరొహడు, ఎగిరి గెంతే మినిస్టరొహడు...’. లోకం తీరుని ఇంతబాగా తెలుసుకున్న హేడ్డుగారిని బోల్తా కొట్టిస్తాడు రాకెట్‌ అప్పారావు. ‘డబ్బుండాల, మాయుండాల, దబాయింపు సెక్సనుండాల’ అంజెప్పీసి అటు గురువుకీ, ఇటు పోలీసు డిపార్టుమెంటుకీ ఎగనామం పెట్టేస్తాడు.

ఈ లోకంలో పాపపుణ్యాలులేవు, లాభనష్టాలే ఉన్నాయి. అంతేకాదు, పాపం, పుణ్యం అనేవి సాపే క్షికాలు అని ‘పుణ్యం’ కథలోని ప్రధాన పాత్రయిన బాగా బలిసిన లాయరు మనకు తెలియజేస్తాడు. అందులోనే ఒక మేజిస్ట్రేటుగారికి ఒక థీయరీ ఉంటుంది. ‘ఇంత చదువుకొని, ఇంత ఉద్యోగంచేస్తూ నేనే ఇంత దొంగవెధవని కదా? మరి ఈ ముద్దాయి లంతా ఇంకా పెద్ద దొంగ వెధవలు కాకపోతారా?’ అంటాడాయన. పోలీసుల్లోకూడా పుణ్యాత్ములుంటారా? అలాగే బ్రాహ్మల్లో మహాత్ములుంటారా? అనే ప్రశ్నలకు ఒకమేరకు సమాధానం దొరుకుతుంది కథ చివరిలో.
 

పుల్ల కల్లు నిషా పదార్థం గనుకనూ, పుల్ల కల్లు తీపి కల్లునుంచీ, అదేమో తాటిచెట్టునుంచీ వస్తాయి గనుకనూ తప్పంతా తాటిచెట్టుదే అని వాదించిన ముద్దాయి మూలంగా మేజిస్ట్రేటుకి పిచ్చిలేస్తుంది ‘మోక్షం’ కథలో. చివరికి ఆయన్ని పిచ్చాసుపత్రికి తీసుకెళితే, ‘గవర్నమెంటు పిచ్చాసుపత్రి! అవును, గవర్నమెంటుకి పిచ్చెక్కింది కదూ, పాపం!’ అంటాడు.

మన పోలీసులూ, న్యాయవ్యవస్థ ఎవరికి కొమ్ము కాస్తాయో, ఎవర్ని ముద్దాయిల్నిచేసి బోనెక్కిస్తాయో, చివరికి ఎవర్ని దోషులుగా ప్రకటించి జైళ్ల పాలు చేస్తాయో రావిశాస్త్రి అరవైఏళ్ల క్రిందటే పసిగట్టాడు. ఈ విషయాల్లో ఆయనకెటువంటి అపోహలూ లేవు.

 

ఇప్పుడు మద్యంమీద వచ్చే పన్నుతో ప్రభుత్వా లకి వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఆ డబ్బుతోనే ప్రజాసంక్షేమ పథకాలు నడుస్తున్నాయంటారు. ‘సారా లేకపోతే సంక్షేమం లేదు’ అనే రోజులొచ్చాయి. ప్రధాన బాధితులైన పేద స్త్రీల నాయకత్వంలో ఉవ్వెత్తున లేచిన మద్యపానవ్యతిరేక ఉద్యమకెరటం అణగారి పోయింది. ఊళ్లల్లో నీళ్లున్నా లేకపోయినా మద్యం మాత్రం నిరాటంకంగా ప్రవహిస్తున్నది. నీళ్లకోసం ఆడవాళ్లు ఊరుదాటి మైళ్లకొద్దీ నడుస్తారు. మొగాళ్లకి కావల్సినంత మద్యం మాత్రం ప్రతి వీధిలోనూ దొరుకుతుంది. ఇళ్లూ, ఒళ్లూ గుల్లవుతున్నాయి; కుటుం బాలు వీధిన పడుతున్నాయి. తాగుబోతులుగా మారిన ప్రజలు సాధించగలిగేది అంతకన్నా ఏముంటుంది? ఈ సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా మన రాజకీయ వర్గాలకు తెలుసు. అందుకే ఎన్నికల్లో మద్యం ప్రవహిస్తుంది. పేకెట్లు భద్రంగా ఇళ్లకు చేరతాయి. ‘ఇవన్నీ మామూలే’ అనుకొనే దశకు చేరుకున్నాం.

ఒకప్పటి సారాకథ నేటి సమాజపు కథ. ఆ నిరు పేదలూ అలాగే ఉన్నారు, వాళ్లని వాడుకొని సొమ్ము చేసుకొనేవాళ్లు మాత్రం తెగబలిసారు. అంతేకాకుండా వాళ్లు మరింత బరితెగించారు. ఒక్క వాక్యంలో చెప్పా లంటే రావిశాస్త్రి ప్రేమించిన మనుష్యుల జీవితాలు మరింత దిగజారిపోయాయి; ఆయన అసహ్యించుకున్న వాళ్లు మాత్రం బాగా పైకి ఎగబ్రాకారు. ఈ సమాజం ఇలా ఉన్నంతకాలం సారా కథలుంటాయి. ‘నువ్వు ఎవరి పక్షాన ఉన్నావో తేల్చుకో’ అని పాఠకుల్ని నిల దీస్తూనే ఉంటాయి. భావోద్వేగాలకు లోనుకాకుండా, కళ్లవెంట నీళ్లు కారకుండా అతని కథల్ని ఇప్పటికీ చదువుకోలేం. ఆ కన్నీళ్లు పగలబడి నవ్వుకోవడం వలన వచ్చినవి కావచ్చు; పట్టరాని ప్రాపంచిక దుఃఖం మూలంగా బయటపడ్డవి కావచ్చు. వాటి నిత్య నూతనత్వం వెనక ఉన్న బహిరంగ రహస్యం ఇదే తప్ప మరోటికాదు అని నా విశ్వాసం.

************ 

ఉణుదుర్తి సుధాకర్‌

90006 01068