ప్రఖ్యాత నాటక సినీ రచయిత అనిశెట్టి సుబ్బారావు చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నంలో 1922 అక్టోబర్‌ 23న జన్మించారు. 1942లో నరసరావుపేటలో నవ్య కళాపరిషత్‌ను స్థాపించారు. గాలిమేడలు, యువ జ్వాల, మాఊరు, శాంతిలేదు, ఉన్నది కోరుకున్నది, జీవనసంగీతం, చరమాంకం అనే నాటకాలు, నాటికలతో పాటు శాంతి మూఖాభినయ నాటికను రచించారు. డబ్బుకు సమాజంలో ఎంత విలువ ఉందో డబ్బు సంపాదించినవారు సమాజంలో ఎంత గొప్పవారుగా చిత్రీకరించబడుతున్నారో కళ్లకు కట్టినట్లు చేసిన రచన గాలి మేడలు. ఫ్రాయిడ్‌ మనో విశ్లేషణ, సిద్ధాంతం ఆధారంగా అనిశెట్టి ఈ నాటకాన్ని 1950లో రచించారు. ఈ నాటకంలో అనిశెట్టి బ్రెక్ట్‌ తథాత్మ్య విచ్ఛిత్తి సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రయోగించారు. నాటకం జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల నుండి పాత్రలు రంగస్థలంపైకి ప్రవేశించే విధానానికి ఆధునిక నాటక రంగంలో మొదటిసారిగా అనిశెట్టి గాలిమేడలు నాటకం ద్వారా ప్రయోగించారు. నాటకంలోని పాత్రలన్నీ సజీవమూర్తులుగా ప్రత్యక్షమవుతాయి. మానవునిలో అంతర్లీనంగా దాగిఉన్న పశు ప్రవృత్తి ఎంతటి విలయాలకు దారితీస్తుందో ఈ నాటకం ద్వారా వివరించారు. స్వార్థం, ద్రోహబుద్ధి, మోసం, ఆర్థిక శక్తికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే ఈ నాటి సాంఘిక వ్యవస్థ మారాలని ఈ నాటకం సందేశమిస్తుంది. ప్రజానాట్యమండలిపై నిషేధాన్ని విధించిన సమయంలో ఈ నాటకాన్ని విజయవాడ, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ నాటక సంస్థ ఆధ్వర్యంలో సినీ నటులు సి నాగభూషణం, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, కర్నాటి లక్ష్మీనరసయ్య, కారెపు అప్పలస్వామి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించారు.

- డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు, 9848351517