గురజాడవారి ‘కన్యాశుల్కం’లో గిరీశం అగ్నిహోత్రావ ధానులతో ఇలా అంటాడు: ‘‘బుచ్చెమ్మ గారి కేసు విషయమై జబ్బల్పూర్‌ హైకోర్టు తీర్పొహటి మనకి మహాబలంగా వుంది’’ (1909 నాటి రెండో ప్రచురణ: ద్వితీ యాంకం, 3వ స్థలం). 1892 నాటి మొదటి రచనలో కూడా ఇదే సందర్భంలో, ఇదే మాటని ఉటంకించారు. సుమారుగా దశాబ్దంన్నరపైచిలుకు కాలం తరువాత, మార్పులు చేర్పులతో రూపుదిద్దికున్న రెండో కూర్పు సరికొత్త రచన వంటిదే, అని గురజాడవారే స్వయంగా ముందు మాటలో ఉద్ఘాటించారు. అయినా జబ్బల్పూర్‌ హైకోర్టు ప్రసక్తి మాత్రం మార్చలేదు. 

 
మొట్టమొదటి కన్యాశుల్కాన్ని సేకరించి పాదసూచికలతో, అనుబంధాలతో ప్రచురించిన కీ.శే. బంగోరె కూడా ఆ సంభాషణ వున్న పుటకు పాదసూచికలో ‘‘జబ్బల్పూర్‌లో హైకోర్టేమిటి? గిరీశం బుకాయింపేనా?’’ అని ప్రశ్నార్థకాన్ని సంధించి విడిచి పెట్టారు. అప్పటికి జబ్బల్పూర్‌ హైకోర్టు లేనిమాట నిజం.
అయితే 1892లో అవతరించిన గిరీశం ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా ఎదిగి, బాగా ముదిరి, 1909నాటికి పరిపూర్ణ ఛద్మ రూపాన్ని సంతరించుకున్నాడు. అతని మాటల్లోనే, ‘‘నోరుబెట్టుకు బతకమనే దేవుడు చేసాడు’’ అన్నట్టు తయారయ్యాడు. దగాని పంచెగా, అబద్ధాన్ని లాల్చీగా తొడుక్కున్నాడు. అతడి నైజం తెలిసినవా రెవరైనా బంగోరె వలెనే భావిస్తారు. నిజంగా గిరీశంది బుకాయింపే. సందేహం లేదు. కానీ గురజాడవారి నిర్యాణం (1915) తరువాత ఈ అబద్ధమే సుబద్ధమై కూర్చుంది. 1936లో బ్రిటిష్‌ హయాంలోనే జబ్బల్పూర్‌ హైకోర్టు స్థాపించబడింది.
 

కొంచం చరిత్రలోకి వెళ్తే- జబ్బల్పూర్‌ హైకోర్టు ఇప్పుడున్న సుందర సువిశాలమైన భవనాన్ని రాజా గోకుల్‌ దాస్‌ 1896లో ప్రారంభించి 1899లో పూర్తి చేయించారు. దీన్ని రూపకల్పన చేసిన శిల్పి హెన్రీ ఇర్విన్‌. దాన్లోనే 1936లో బ్రిటిష్‌వారు జబ్బల్పూర్‌ హైకోర్టుని ప్రా రంభించారు. విశాల మైన సెంట్రల్‌ ప్రావిన్స్‌ తాలూకు న్యాయపరమైన అంశాలకు అదే హైకోర్టు కేంద్ర బిందువుగా ఉండేది. స్వాతంత్ర్యానం తరం 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ఒకనాటి ‘మధ్య భారత్‌’ ఇప్పటి ఇండియాలో మధ్యప్రదేశ్‌గా అవత రించింది. అంతపెద్ద భూభాగానికీ హైకోర్టు మాత్రం రాజధాని అయిన భోపాల్‌ గాక, జబ్బల్పూరు లోనే వుంది.  అలా ఒక మహాకవీ, యుగకర్తా తన నాటకంలో ఒక పాత్ర చేత ‘గప్పా’గా, ‘ఠస్సా’గా చెప్పించిన మాట వాస్తవ రూపం ధరించింది. 

 

*********
టి. షణ్ముఖరావు
99493 48238