విశాఖపట్నం: తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తి తన స్థానాన్ని సుస్ధిరం చేసుకున్న మహాకవి అని ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం అధ్యక్షుడు డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తి పేర్కొన్నారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తి 150వ జయంత్యుత్సవాన్ని శనివారం సాయంత్రం పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తి 150వ జయంతి విశేష సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంవీవీఎస్‌ మూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ తొలి ఆస్థానకవి అయిన శ్రీ పాదకృష్ణమూర్తి శాస్ర్తి కవి సార్వభౌముడు, మహోపాధ్యాయ, కళాప్రపూర్ణ అని కొనియాడారు. ఆధునిక కాలంలో తెలుగును విస్మరిస్తున్నారని, తెలుగు సాహిత్యం, కవిత్వానికి పెద్దపీట వేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు పద్యాలు నేర్పించి మన తెలుగు భాష ఔనత్యాన్ని చాటిచెప్పాలన్నారు.

 ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త విశ్లేషకుడు డాక్టర్‌ డీవీ సూర్యారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శలాక రఘునాథ శర్మ, సినీ రచయిత, సాహితీవేత్తశ్రీరాంభట్ల నృసింహశర్మ, శ్రీపాద ముని మనుమడు కల్లూరి శ్రీరామ్‌, మంగు శివరామప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.బీచ్‌రోడ్డులో..బీచ్‌రోడ్డు : ఆర్కే బీచ్‌లో ఉన్న విశాఖ మ్యూజియంలో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి జయంత్యుత్సవ సమితి ఆధ్వర్యంలో ఉదయం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద వారి గండపెండేరం, ఆయనకు లభించిన బహుమతులు, పతకాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ప్రధానాచార్యులు శలాక రఘునాథ శర్మ ముఖ్యఅతిఽథిగా విచ్చేసి శ్రీపాద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో శ్రీపాద మునిమనవడు కె.శ్రీరామ్‌, కె.విజయలక్ష్మి, డాక్టర్‌ డీవీ సూర్యారావు, శివరామప్రసాద్‌ పలు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.