విశాఖపట్నం: అక్షరం కోసం కొన్ని తరాల పాటు పోరాటాలు చేసిన ఘనత తెలుగుకే ఉందని, అటువంటి తెలుగు భాషను కాపాడుకుందామని ప్రముఖ సాహితీవేత్త, తెలుగు భాషా పరిశోధకులు స.వెం.రమేశ్‌ పేర్కొన్నారు. పరవస్తు పద్య పీఠం ఆధ్వర్యంలో ‘ఎల్లలు లేని తెలుగు’ అంశంపై శుక్రవారం సాయంత్రం పౌర గ్రంధాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో తమిళనాడులో తెలుగు కోసం ఉద్యమాలు చేశారన్నారు. ఇప్పటికీ దక్షిణ తమిళనాడులో 41 శాతం తెలుగు మాట్లాడేవారు ఉన్నారన్నారు. తమిళనాడులోని కలసపూడి ప్రాంతంలో వెయ్యి కుటుంబాలునివసిస్తున్నాయని, ఇప్పటికీ అక్కడ తెలుగులోనే మాట్లాడుకుంటారన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య బాలమోహన్‌దాస్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాలన్నారు.

 తెలుగును రక్షించుకుందాం, అందరికి పంచుదామన్నారు. చీఫ్‌ ఇంజనీరు పి.కోదండరామయ్య మాట్లాడుతూ తెలుగు కోసం పూర్తిగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి స.వెం.రమేశ్‌ అని కొనియాడారు. ముందుగా స.వెం. రమేశ్‌ను పరవస్తు పద్యపీఠం వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు, విజయ నిర్మాణ కంపెనీ అధినేత డాక్టర్‌ ఎస్‌.విజయకుమార్‌, సీఎస్‌ రావు, బంగ్రారాజు, పరవస్తు పద్య పీఠం ప్రతినిధి సూరి తదితరులు పాల్గొన్నారు.