ఢిల్లీ వర్సిటీ విశ్రాంత ఆచార్యుడు తిరుమలి

పాలకుల్లో చరిత్రను తిరగ రాయాలన్న ధోరణి: కె.శ్రీనివాస్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన 1857 పోరాటాన్ని ఒక తిరుగుబాటుగా మాత్రమే చూడాలని.. స్వాతంత్య్ర పోరాటంగా అభివర్ణించలేమని చరిత్ర అధ్యయనకారుడు, ఢిల్లీ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యుడు ఇనుకొండ తిరుమలి అన్నారు. ఆ పోరాటం ప్రజాస్వామ్య విలువల ఆకాంక్షతో సాగకపోవడమే అందుకు కారణమని వివరించారు. ి సిపాయిల తిరుగుబాటును తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా కొనియాడుతూ 1909లో వీడీ సావర్కర్‌ ‘‘ది ఇండియన్‌ వార్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌’’ రచన చేయడం వెనుక హిందూత్వ అజెండా దాగుందన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘‘1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాటం-చారిత్రక దృక్పథం’’ అంశంపై ఆదివారం చర్చాగోష్ఠి జరిగింది.

ఆచార్య తిరుమలి మాట్లాడుతూ.. 1857 తిరుగుబాటులో హిందువులు, ముస్లింలు కలిసి బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. చరిత్రను కొత్తగా తిరగ రాయాలన్న ధోరణి ప్రస్తుత పాలకుల మాటల్లో వ్యక్తమవుతోందన్నారు. అందుకే సావర్కర్‌ ప్రస్తావన తీసుకొస్తున్నారని చెప్పారు. 1857 నాటి తిరుగుబాటుదారుల్లోనూ ప్రజాస్వామ్యయుత ఆకాంక్ష ఉన్నట్లు వెల్లడవుతోందన్నారు. కొత్త చరిత్ర రచన ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.