చిక్కడపల్లి, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి): ఎంవీఆర్‌ ఫౌండేషన్‌, త్యాగరాయగానసభల ఆధ్వర్యంలో సుప్రసిద్ధ రచయిత, కథానికాజీవి డా. వేదగిరి రాంబాబు సాహిత్య వ్యక్తిత్వ చైతన్యంపై ప్రసంగ కార్యక్రమం సోమవారం రాత్రి త్యాగరాయగానసభలో జరిగింది. ముఖ్యఅతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా. పాలకోడేటి సత్యనారాయణరావు హాజరుకాగా విశిష్ఠ అతిథులుగా కస్తూరి మురళీకృష్ణ, వేదగిరి విజయచంద్ర తదితరులు పాల్గొని రాంబాబు చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేదగిరి రాంబాబు కథానిక గురించి ఎంతో తపన పడ్డారన్నారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో కథానిక గురించి సదస్సులు, చర్చావేదికలు నిర్వహించారని, ఆయన స్ఫూర్తి కొనసాగించాలన్నారు. ఈ సదస్సులో భాగంగా నిర్వాహకులు ఎం.వెంకటరమణ శ్రీ వికారి నామ ఉగాది సందర్భంగా నిర్వహిస్తున్న డా.పాలకోడేటి అప్పారావు స్మారక ప్రథమ కథానికా పోటీ వివరాలను ప్రకటించారు.