విశాఖ: చక్కని కథాంశాలు, కళాకారుల అద్భుత ప్రదర్శనలతో కళాభి మానులను ఉర్రూతలూగిస్తున్న జాతీయ నాట కోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. కళాభారతి ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌, రసజ్ఞ సాంస్కృతిక సేవాసంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయిదు రాష్ర్టాల జాతీయ స్థాయి కళాకారులు ఈ నాటకోత్సవాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ముగింపోత్సవం సందర్భంగా ఏయూ రిజిస్ట్రార్‌ వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఐదు భాషల నాటకాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయ మన్నారు. రాబోయే రోజుల్లో ఆరుబయలు రంగస్థలం (కేవీ గోపాలస్వామి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌)ను అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే అసెంబ్లీ హాల్‌, బీచ్‌లో ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను ఆధునీకరించి త్వరలో కళాకారులకు సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను గొల్లపూడి మారుతీరావు, సత్యానంద్‌ వంటి అనుభవజ్ఞులకు అప్పగిస్తామన్నారు. జాతీయ నాటకోత్సవాలు చక్కగా నిర్వహించిన త్రినాథరావును అభినందించారు.

ఏయూ మీడియా సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య బాబీవర్ధన్‌ మాట్లాడుతూ అరవై ఏళ్ల క్రితం మహామహులు ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో కళలకు శ్రీకారం చుట్టారన్నారు. అమ్మ ఒడిలాంటి ఈ రంగస్థలంపై తర్ఫీదు పొందారని చెప్పారు. కార్యక్రమంలో సింగారం శ్రీనివాసరావు, మహ్మద్‌ అల్తాఫ్‌, జాతీయసాంస్కృతికశాఖ కార్యవర్గసభ్యులు టి.వి.రంగయ్య, రసజ్ఞ డైరెక్టర్‌ వి.త్రినాథరావు, సీనియర్‌ పాత్రికేయుడు రమణమూర్తి పాల్గొన్నారు.

అలరించిన ‘దావత్‌’

హైదరాబాద్‌ పాప్‌కార్న్‌ థియేటర్స్‌ వారిచే ‘దావత్‌’ తెలుగు నాటకాన్ని తిరువీర్‌ రచనా దర్శకత్వంలో తెలంగాణ మాండలికంలో చక్కగా ప్రదర్శించి ఆహూతులను అలరించారు. తిరువీర్‌, కాంతికుమార్‌, మనోజ్‌, వికాస్‌ చైతన్య, లక్ష్మణ్‌ మీసాల, శ్రీనివాస్‌ రేణిగుంట్ల నికిల్‌ జాకబ్‌. సుధాకర్‌ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.