విజయవాడ: దీపావళి, సంక్రాంతి పండుగల్లా విశ్వనాథ జయంతి ఉత్సవాలను తెలుగువారు జరుపుకునే రోజులు రావాలని ప్రముఖ పంచ సహస్రావధాని మేడసాని మోహన్‌ అన్నారు. స్ధానిక విజయవాడ కల్చరల్‌ సెంటర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో శనివారం విశ్వనాథ 121వ జయంతి వేడుకలు శ్రీవిశ్వనాథ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేదికపై విశ్వనాథుడు రాసిన ‘పరీక్ష’ నవల ఆంగ్ల భాషా అనువాద పుస్తకాన్ని ఆయన ముఖ్య అతిథిగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వనాథుని రచనలు ఆంగ్లభాషలోకి అనువదించటం అభినందనీయమని, ఇలాంటి అనువాదాలు మరెన్నో జరగాలన్నారు. విశ్వనాఽథ సాహిత్యంలో భక్తి రసపు విజ్ఞానం పుష్కలంగా లభిస్తుందన్నారు. కవిసామ్రాట్‌ మనుమడు విశ్వనాథ సత్యనారాయణ మాట్లాడుతూ 1949-51 మధ్య కవిసామ్రాట్‌ రాసిన నవల ‘పరీక్ష’ అన్నారు. 

రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం భారతదేశ పరిస్ధితి, ఆర్థిక వ్యవహారాలు, మార్పులు, పరిణామాలు వంటి విషయాలను అన్ని కోణాలలో విద్యార్థుల కోసం ఆవిష్కరించిన రచన అని తెలిపారు. ఈ పుస్తకాన్ని తొలి ఆంగ్ల అనువాదంగా ప్రారంభించామన్నారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్‌ జి.వి.పూర్ణచంద్‌ మాట్లాడుతూ విశ్వనాథుడు నిత్య జాగృతావస్ధలో ఉండి ఏదైతే రాశారో పాఠకుని మదిలో కూడా అదే భావం ఆవిష్కృతమవుతోందన్నారు. కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ, సహ అధ్యాపకులు అండవల్లి సత్యనారాయణ, సాహిత్య పరిశీలకులు జి.వి.ప్రణవ్‌కుమార్‌ వశిష్ఠ పాల్గొన్నారు.