1098కళ్ళు చిన్నవి చేసి మరీ చూసాడు మోహన్రావు... సందేహం లేదు 1098... భూతద్దం తెచ్చి మరీ చూసాడు.. ఈసారి మరింత స్పష్టంగా 1098 అంకెలు కన్పించాయి. దాని పక్కన చిన్నబొట్టు లాగా ఎర్రటి మరక కనపడింది. వేలితో తాకి చూసాడు. పొడిగా అంటుకుంది కుంకుమ! అంటే 1098 అంకె వేసి దాని పక్కన కుంకుమ బొట్టు పెట్టారు.అదిరిపడ్డాడు మోహన్రావు. అలా 1098, దాని పక్కన చిన్న కుంకుమ బొట్టు చూడటం ఇదే మొదటిసారి అయితే అంతలా అదిరిపడేవాడు కాదేమో! మొదటిసారి కిటికీ మూల మీద చూశాడు. కార్పెంటర్లు రాసుంటారులే అనుకుని చెరిపేసాడు. ఆ తర్వాత ఇన్వర్టర్‌ రిపేర్‌కి వస్తే దాని వెనక ప్రత్యక్షం అయింది 1098, పక్కన చిన్న కుంకుమబొట్టు. ఇదిగో ఇప్పుడిలా కార్నర్‌ టేబుల్‌ వెనక!ఏమిటో ఈ 1098.... అవి విడివిడి అంకెలా? మొత్తం ఒకటే సంఖ్యా... దానిపక్కన చిన్నబొట్టు. ఎవరు రాస్తున్నారు? ఎందుకు రాస్తున్నారు? చాలాచోట్ల ఒకేసారి రాసారా? ఒకచోట చెరిపేస్తే మరోచోట రాస్తున్నారా? పోనీ పెద్ద సైజులో అందరికీ కనపడేలా రాస్తున్నారా? లేదు! అంటే చిన్న సైజులో ఎవరికీ కన్పించకూడదనే ఉద్దేశంతో రాసినట్టు క్లియర్‌గా అర్థమవుతోంది!

1098ని, బొట్టునీ తడిగుడ్డతో తుడిచేసాడు.కాని గుండెల్లో తిష్టవేసుకున్న బెంగని గుబులుని తుడిచేయటం ఎలా?మొదటిసారి చూసినప్పుడు భార్య సుజాతని, టెన్త్‌ క్లాస్‌ చదివే కూతురు దృశ్యని, ఇంట్లో పనీపాటలు చేయటానికి ఊర్నించి తెచ్చుకున్న పన్నెండేళ్ళ పని వాడు కిట్టుగాడ్ని అడిగాడు. ముగ్గురూ మాకు తెలీదన్నారు. రెండోసారి 1098 కన్పించినప్పుడు కూడా అడిగాడు. అదే సమాధానం!ఎలా తెలుసుకోవటం... తెలుసుకోనిదే మనశ్శాంతి లేదు... సిగరెట్‌ కాల్చుకుందామని పెరట్లోకి వచ్చాడు...అక్కడ షూస్‌ పాలిష్‌ చేస్తున్నాడు కిట్టు... సరిగ్గా చేయమని వాడిని మొట్టికాయలు మొడుతోంది సుజాత. వాళ్ళని ఫోటోలు తీస్తోంది దృశ్య! దృశ్యకి ఫోటోలు తీయటం, ఫోటోలని పోటీలకి పంపించటం హాబీ!1098 మళ్ళీ దర్శనమిచ్చిందని - మీలో ఎవరైనా రాసారా అని అడిగితే తనకి చాదస్తం, మనుషుల్ని నమ్మకపోవటం అనే రెండు జబ్బులు ఏకకాలంలో వచ్చాయని తీర్మానిస్తారని భయపడి సిగరెట్‌ని ఆశ్రయించాడు.