ఐదు నిమిషాలు చూసి మిత్రులంతా బయటకొచ్చారు. హ్యారీ కోసం ఆగుదామా... చెర్రీ అడిగాడు.లేదు.. మనల్ని వెళ్లమని చెప్పాడు.. బెన్‌ అన్నాడు. హ్యారీ.....భూగ్రహానికి, చంద్రగ్రహానికి మధ్య ఉన్న ఒక స్పేస్‌ స్టేషన్‌లో మానవుల ఆత్మలపై పరిశోధన చేస్తున్నాడు. ఆత్మలను లొంగదీసుకుని మానవసేవకు వినియోగించుకోవడం హ్యారీ రీసెర్చ్‌ ప్రధానాంశం. బెన్‌ అప్పటి వరకు స్విచ్చాఫ్‌ చేసి ఉన్న కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ను ఆన్‌ చేశాడు. ఇంతలో....మైగాడ్‌... బెన్‌ కేక.ఏమైంది... చెర్రీ ఆత్రంగా అడిగాడు...హ్యారీ.. హ్యారీ... గొణిగాడు బెన్‌...ఏమైంది ... ఏమైంది .. అన్ని గొంతుల్లోనూ ఆందోళన. నిన్న సాయంత్రం 4 గంటలకు బుల్లెట్‌ ట్రైన్‌కు వైజాగ్‌ స్టేషన్‌ సమీపంలో జరిగిన ప్రమాదంలో హ్యారీ మరణించాట్ట..!

******************* 

గాలి పూర్తిగా స్తంభించింది.వాతావరణంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతున్న సూచన కనిపించిన వెంటనే ముంజేతికి ఉన్న వాచీలాంటి పరికరంలో ఎలర్ట్స్‌ మొదలయ్యాయి. రోడ్‌పై ఉన్న వాళ్లు గబగబా ఆక్సిజన్‌ మాస్క్‌లను తగిలించుకోవడం మొదలెట్టారు. వీధి చివర్లో ఉన్న ఎయిర్‌ బ్లోయర్స్‌ పనిచేయడం మొదలెట్టాయి.అప్పుడప్పుడూ ఇలా జరుగుతుంటుంది. అందుకే ప్రభుత్వం ఎయిర్‌ బ్లోయర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితి కొన్ని గంటలుంటుంది. కాని కొన్ని రోజుల పాటు ఇలా ఉంటే... ఆలోచనకే నవ్వొచ్చింది...చెర్రీకి.కొన్నేళ్ల క్రితం ఏడాదికి మూడు రుతువులుండేవి. ఎండకాలం, వానకాలం, చలికాలం... వాటి గురించి వింటూంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏడాదంతా ఎండ లుంటున్నాయి. ఎప్పుడైనా వర్షాలు పడతాయి. వానాకాలం ప్రత్యేకంగా ఉండేదనడానికి సింబాలిక్‌గా ఆగస్టులో రెయిన్‌డే సెలబ్రేషన్స్‌ చేస్తున్నారు. ఆ రోజు సిటీ అంతా నీళ్లు చిలకరిస్తారు. ఆదో పెద్ద వేడుక.ఆక్సిజన్‌ తగ్గడం వల్ల ఊపిరి కష్టం కావడంతో గబగబా నడుస్తూ పార్కింగ్‌ బేలో ఉన్న కారును చేరుకున్నాడు చెర్రీ. ఆసరికే యజమాని రాకను గ్రహించి సెన్సర్స్‌ యాక్టివేట్‌ ఆయ్యాయి. డోర్‌ తెరుచుకుంది. లోపలికెళ్లి కూచోగానే ఆక్సిజన్‌ జనరేటర్‌ మొదలైంది. టైమ్‌ సాయంత్రం పదినిమిషాలు తక్కువ ఆరు. 

వైజాగ్‌ నుంచి బుల్లెట్‌ ట్రైన్‌లో నాలుగు గంటలకు బయలుదేరిన హ్యారి ఈ పాటికి హైదరాబాద్‌ సమీపంలోకి వచ్చి ఉంటాడు. నేరుగా బెన్‌ ఇంటికి వెళ్లడమా లేక హ్యారీని పికప్‌ చేసుకోవడమా...? ఒక్క క్షణం ఆలోచించాడు.హ్యారీ గురించిన ఆలోచన రాగానే.... చెవిపక్కన చిన్న వైబ్రేషన్‌. ఎవరో కాల్‌ చేస్తున్నారు. రిస్ట్‌కున్న పరికరం వైపు చూడగానే హ్యారీ అన్న పేరు కనిపించింది. ఫోటో మాత్రం లేదు. థింక్‌ ఆఫ్‌ ది డెవిల్‌... అనుకున్నాడు. హాయ్‌ ... అనబోతుండగానే హ్యారీ గొంతు వినిపించింది... హ్యారీ చెప్పింది వింటూ... ఓకే...ఓకే టేక్‌ కేర్‌... మరీ లేట్‌ చేయొద్దు... అని హెచ్చరించాడు చెర్రీ.దాహంగా అనిపించడంతో వాటర్‌ కాప్స్యూల్‌ నోట్లో వేసుకున్నాడు. కారును నడిపించే రోబో సిస్టమ్‌ను ఆన్‌ చేసి ‘బెన్‌ వాళ్ల ఇల్లు....’ అని చెప్పాడు. మరుక్షణంలో కారు రోడ్డు మీదికి దూకింది.