దేవిముప్ఫై ఆరో కార్లోంచి కన్సోలెన్స్‌ పార్టీని మూడో ఫ్లోర్లోని రూమ్‌ నెంబర్‌ ట్వంటీఫోర్‌లోకి జేరేసి యివతలికొచ్చాడు డ్రైవర్‌ ఆనంద్‌.అతని గుండెలోతుల్లోంచి యాభై ఒకటోసారి భారంగా వెలవడింది దీర్ఘమైన నిట్టూర్పు!ఉదయం ఏడున్నర ప్రాంతంలో సోమేష్‌బాబు దంపతులను మొట్టమొదట ఓదార్చటానికి దిగిన జాబ్‌ని పైకి తీసుకువెళ్తూండగా ఆనంద్‌ మనసుపొరలను దాటుకుంటూ వెలువడింది ఒక దీర్ఘమైన నిట్టూర్పు!అప్పటినుంచి ఏవరేజ్‌న పదినిమిషాలకోసారి అతని గుండె అంచుల్ని దాటి పైకి వస్తూనే వుందది.లిఫ్ట్‌ ఎంగేజ్‌లో వుండటంతో వుసూరుమంటూ ఒక్కొక్కమెట్టే దిగసాగాడు ఆనంద్‌.బాబయ్యగారి మరణం మరీ యింత క్లాస్‌గా రూపుదిద్దు కుంటుందని అతను కలలో కూడా అనుకోలేదు.కోటీశ్వరుడైన ఆయన కేన్సర్‌తో తీసుకుంటూ మూడంతస్థుల తన భవనం ఔట్‌హౌస్‌లో ఒక్క తను తప్ప మరెవరూ పలకరించేవాళ్లు కూడా లేని నికృష్ట జీవితం గడిపారని ఈ ఓదార్చ టానికొచ్చేవాళ్లలో ఏ ఒక్కరికైనా తెలిసి వుంటుందా?కొడుకూ, కోడలు అనుమతి లేకుండా తన బాంక్‌ బాలెన్స్‌ అయిదు లక్షలూ అనాథశరణాలయానికి డొనేషన్‌గా యిచ్చిన నేరానికి ఆయన కారాగారవాసంకంటే కఠినమైన శిక్ష అనుభవించా రని ఈ వస్తూన్న జనాలలో ఎవరికైనా తెలుసా!‘‘సోమేష్‌ బాబుగారి నాన్నగారెక్కడున్నా రు?’’ మెట్లమీదుగా తనకెదురు నడిచివస్తూన్న ఒక నడివయసాయనకి ‘‘మూడో ఫ్లోర్‌, ఇరవై నాలుగో రూమ్‌’’ అని చెప్పి తన మానాన తను మెట్లు దిగి వచ్చి వరండాలో వున్న బెంచిమీద కూర్చున్నాడు.ఆయన ప్రాణం తెల్లవారు జామున మూడూ అయిదు నిమిషాలకు ఆయన తన చేతులమీద వుండగానే పోయింది.

‘‘బాబయ్యగారికలేరు’’ అని తెలియగానే బావురుమని ఏడ్చేశాడతను. వెర్రిలా అలా ఏడుస్తూ దాదాపు పావుగంట ఆయన శవాన్ని చేతుల మీదుగా పెట్టుకుని అలానే వుండిపోయాడు.ఆ తర్వాత తేరుకుని ఆయన తలను చేతుల మీదినుంచి దిండుమీదకు దింపి లేచివెళ్లి చాపతెచ్చి నేలమీద పరిచి బాబయ్యగారి బాడీని అతి ప్రయ త్నమ్మీద చాపమీదికి చేర్చాడు.ఆయన కాళ్ల బొటనవేళ్లను రెంటినీ కలిపి చేర్చి పురికొసతో కట్టి అలమార్లో వున్న ప్రమిదల్లోంచి ఒక ప్రమిదతోమి శుభ్రంగా కడిగి, తుడిచి దాంట్లో దేవుడి దగ్గరి సీసాలోని నువ్వులనూనె నింపి అయిదు వత్తుల్ని ఒక వత్తిగా జమచేసి ప్రమదలో వేసి బాబయ్యగారి తలాపున బియ్యం కుప్పగా పోసి ప్రమిదను ఆ కుప్పపైన వుంచి జ్యోతిని వెలిగించాడు.కిటికీలోంచి దూసుకొచ్చిన గాలి తెరకు ఆ జ్యోతి అటూ యిటూ కదులుతూంటే బాబయ్యగారి ఆత్మ దాంట్లో వున్నట్లనిపించి జ్యోతికి భక్తిగా నమస్కరించాడు.‘‘ఆత్మకు చావులేదురా ఆనంద్‌’’ ఆన్న బాబయ్యగారి మాటలు చెవుల్లో ప్రతిధ్వనించా యాక్షణంలో.చింతలో జారిపోతూన్న గుండెను కూడదీసు కుని పెట్టె పక్కన పడేసి వుంచిన సెల్‌ఫోన్‌ అందుకుని సోమేష్‌ బాబుగారు చెప్పిన నెంబరు నొక్కాడు.